Virat Kohli: కోహ్లీ వంద సెంచరీల రికార్డుపై అభిషేక్ నాయర్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 100సెంచరీల మైలురాయిని అందుకోవాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే 2027 వన్డే ప్రపంచకప్‌లోపే ఈ అరుదైన ఘనత సాధించడం కోహ్లీకి కష్టమేనని భారత జట్టు మాజీ సహాయ కోచ్ అభిషేక్ నాయర్ అభిప్రాయపడ్డాడు. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే కోహ్లీకి తగినన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉండాలని పేర్కొన్నాడు. ప్రపంచకప్‌కు ముందు అందుబాటులో ఉన్న సమయాన్ని పరిశీలిస్తే.. వంద సెంచరీల మార్కును అందుకోవడానికి సరిపడా మ్యాచ్‌లు లేవని జియోస్టార్‌తో జరిగిన చర్చలో వెల్లడించాడు. ప్రస్తుతం కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లు కలిపి 86 సెంచరీలు సాధించాడు. భారత మాజీ క్రికెటర్ చతేశ్వర్ పుజారాతో కలిసి అభిషేక్ నాయర్ ఈ అంశంపై చర్చించాడు.
వివరాలు
వంద సెంచరీలు సాధించాలి
ఈ సందర్భంగా నాయర్ మాట్లాడుతూ.. కోహ్లీ 100 సెంచరీలు సాధించాలని తాను కూడా కోరుకుంటున్నానని చెప్పాడు.
అయితే ఆ స్థాయికి చేరుకోవాలంటే తగినన్ని మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.
2027 ప్రపంచకప్ తర్వాత కూడా కోహ్లీ క్రికెట్ కొనసాగించే అవకాశం ఉందని, కానీ అప్పటికి అతడిలో ఇదే స్థాయిలో స్ఫూర్తి ఉంటుందో లేదో చెప్పలేమని పేర్కొన్నాడు.
అందుకే ప్రపంచకప్‌లోపే వంద సెంచరీల ఘనత సాధించడం కష్టమని భావిస్తున్నట్లు వివరించాడు.
ఇప్పటికే వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు.
ఈ ఫార్మాట్‌లో ఇప్పటివరకు 55 శతకాలు బాదాడు. గతంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 49 వన్డే సెంచరీల రికార్డును కోహ్లీ అధిగమించాడు.
వివరాలు
సెంచరీ నమోదు చేసి చరిత్ర
2023 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తన 50వ వన్డే సెంచరీని నమోదు చేసి చరిత్ర సృష్టించాడు.
ఇదే చర్చలో భారత జట్టు భవిష్యత్తు కూర్పుపైనా అభిషేక్ నాయర్ కీలక సూచనలు చేశాడు.
స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు తోడుగా మరో ఆల్‌రౌండర్‌ను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.
ముఖ్యంగా న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో పర్యటించినప్పుడు ఇద్దరు సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు జట్టులో ఉంటే సమతూకం మెరుగుపడుతుందని చెప్పాడు.
ఇద్దరు ప్రధాన పేసర్లతో పాటు బ్యాటింగ్ చేయగల ఇద్దరు ఆల్‌రౌండర్లు ఉంటే జట్టుకు అదనపు బలం చేకూరుతుందని వివరించాడు.
వివరాలు
అతడే తొలి ఎంపిక
మరోవైపు హార్దిక్ పాండ్యా ఎదుర్కొంటున్న ఫిట్‌నెస్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని నితీశ్ కుమార్ రెడ్డిని ప్రత్యామ్నాయ ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దాలని చతేశ్వర్ పుజారా సూచించాడు.
హార్దిక్ అందుబాటులో ఉంటే అతడే తొలి ఎంపిక అని స్పష్టం చేశాడు.
అయితే ఏడాది పొడవునా హార్దిక్ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండలేకపోతున్న నేపథ్యంలో.. అతడికి సమాన సామర్థ్యాలు కలిగిన మరో ఆటగాడు జట్టులో ఉండటం అవసరమని పేర్కొన్నాడు.
ఇక వన్డే క్రికెట్‌పై అభిమానుల్లో ఆసక్తిని మళ్లీ పెంచేందుకు ముక్కోణపు, నాలుగు దేశాల టోర్నీలను నిర్వహించాలని అభిషేక్ నాయర్, చతేశ్వర్ పుజారా అభిప్రాయపడ్డారు.
వివరాలు
ఎక్కువసార్లు చూసే అవకాశం
మూడు లేదా నాలుగు జట్లు పాల్గొనే టోర్నీల్లో ప్రతి మ్యాచ్‌కు ప్రాధాన్యం ఉంటుందని పుజారా పేర్కొన్నాడు.
దీంతో అభిమానులకు తమ అభిమాన ఆటగాళ్లను ఎక్కువసార్లు చూసే అవకాశం లభిస్తుందని చెప్పాడు.
ఇలాంటి టోర్నీలు పెద్ద టోర్నమెంట్లకు జట్లను సిద్ధం చేయడంతో పాటు వన్డే ఫార్మాట్‌పై అభిమానుల్లో ఆసక్తిని పెంచుతాయని నాయర్ అభిప్రాయపడ్డాడు.
గతంలో షార్జాలో ఆస్ట్రేలియాపై సచిన్ టెండూల్కర్ ఆడిన చారిత్రక ఇన్నింగ్స్ వంటి మరపురాని జ్ఞాపకాలు ఇలాంటి టోర్నీలతోనే ముడిపడి ఉన్నాయని గుర్తుచేశాడు.
మొత్తంగా వన్డే క్రికెట్‌కు పూర్వ వైభవం తీసుకురావడానికి ముక్కోణపు, నాలుగు దేశాల టోర్నీలు ఉపయోగపడతాయని నాయర్, పుజారా అభిప్రాయపడ్డారు.