Abhishek Sharma: టీ20ల్లో కొత్త చరిత్ర దిశగా అభిషేక్ శర్మ.. కోహ్లీ రికార్డుకు అడుగు దూరంలో!
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) అరుదైన రికార్డుపై కన్నేశాడు. టీ20 ఫార్మాట్‌లో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ (Virat Kohli) పేరిట ఉన్న రికార్డును అభిషేక్ బ్రేక్ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. 2016 సంవత్సరంలో సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ మొత్తం 31 టీ20 మ్యాచ్‌ల్లో 89.66 సగటుతో 1,614 పరుగులు సాధించాడు. ఆ ఇన్నింగ్స్‌లో నాలుగు శతకాలు, 14 అర్ధ శతకాలున్నాయి. ప్రస్తుతం అభిషేక్ శర్మ ఆ రికార్డును బద్దలు కొట్టేందుకు కేవలం 81 పరుగుల దూరంలో ఉన్నాడు.
Details
81 పరుగుల దూరం
ఈ ఏడాది ఇప్పటివరకు అభిషేక్ శర్మ 39 టీ20 మ్యాచ్‌లు ఆడి 1,533 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలు, తొమ్మిది అర్ధ శతకాలు ఉండడం విశేషం. ఈ గణాంకాలే అతడి స్థిరత్వం, దూకుడును స్పష్టంగా చూపిస్తున్నాయి. సఫారీలతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి రెండు మ్యాచ్‌ల్లో అభిషేక్ శర్మ దూకుడుగా ఆడినా భారీ స్కోర్లు నమోదు చేయలేకపోయాడు. ఆ రెండు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 34 పరుగులకే పరిమితమయ్యాడు.
Details
ఆదివారం మూడో టీ20
ఇక ఆదివారం (డిసెంబర్ 14) భారత్, సౌతాఫ్రికా మధ్య ధర్మశాలలో మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడితే విరాట్ కోహ్లీ పేరిట ఉన్న చారిత్రక రికార్డు బ్రేక్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. సిరీస్ పరిస్థితిని పరిశీలిస్తే, తొలి టీ20లో భారత్ విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలిచింది. ప్రస్తుతం సిరీస్ సమం కాగా, ధర్మశాలలో జరిగే మూడో టీ20లో విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యం పొందాలని ఇరు జట్లు పట్టుదలతో బరిలోకి దిగనున్నాయి.