SLvs AFG : శ్రీలంకపై అప్ఘనిస్తాన్ గ్రాండ్ విక్టరీ
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా పూణే వేదికగా ఇవాళ ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో శ్రీలంకపై ఆఫ్ఘన్ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 241 పరుగులు చేసి ఆలౌటైంది. లంక బ్యాటర్లు భారీ స్కోర్లు చేయకుండా ఆఫ్ఘన్ బౌలర్లు కట్టడి చేశారు. ఓపెనర్ పథుమ్ నిస్సాంక(46), కుశాల్ మెండిస్(39), సమరవిక్రమ(36), తీక్షణ(29), ఏంజెలో మాథ్యూస్(23) ఓ మోస్తరు స్కోరు చేయగా, దిముత్ కరుణరత్నే(15), ధనుంజయ డిసిల్వ(14), చమిర(1), రజిత(5) నిరాశపరిచారు. ఆఫ్ఘన్ బౌలర్లలో ఫజల్ హక్ ఫారూకీ 4, ముజీబ్ రెహ్మాన్ 2, రషీద్ ఖాన్, అజ్మతుల్లా ఒమర్ జాయ్ తలో ఓ వికెట్ పడగొట్టారు.
హాఫ్ సెంచరీలతో చెలరేగిన హష్మతుల్లా షాహిది, అజ్మతుల్లా ఒమర్జాయ్
లక్ష్య చేధనకు ఆఫ్ఘాన్ కు ఆరంభంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రహ్మతుల్లా గుర్బార్(0) డకౌట్ అయ్యాడు. తర్వాతి ఇబ్రహీం జద్రాన్ (39), రహ్మత్ షా 62 పరుగులతో లంక బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. వీరిద్దరూ ఔట్ అయిన తర్వాత కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ(57), అజ్మతుల్లా ఒమర్జాయ్(73) హాఫ్ సెంచరీతో చెలరేగి ఆఫ్ఘాన్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. కేవలం 45.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి ఆఫ్ఘన్ టార్గెట్‌ను చేధించింది. లంక బౌలర్లలో మధుశంక 2, రజిత ఒక వికెట్ పడగొట్టాడు.