CSK vs KKR : కోల్‌కతా జట్టుకు మరో షాక్.. అజింక్య రహానేకు భారీ జరిమానా
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఇప్పటివరకు ఏదీ సరిగా కలిసిరావడం లేదు.0 ఈ సీజన్‌లో ఇంకా ఆ జట్టు గెలుపు ఖాతా కూడా ప్రారంభించలేక పోయింది. మంగళవారం చెపాక్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 32 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ సీజన్‌లో ఇది కేకేఆర్‌కు నాల్గో ఓటమి కాగా, మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఇదిలా ఉండగా, కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానేపై ఐపీఎల్ నిర్వాహకులు జరిమానా విధించారు. సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో జట్టు నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయకపోవడం వల్ల స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. ఈ కారణంగా రహానేపై రూ.12 లక్షల జరిమానా విధించారు.
వివరాలు
అందుకే జరిమానా..
ఈ సీజన్‌లో కేకేఆర్ జట్టు స్లో ఓవర్ రేట్ తప్పిదం చేయడం ఇదే మొదటిసారి కావడంతో కేవలం కెప్టెన్‌కే జరిమానా విధించారు. ఇదే తప్పిదం మళ్లీ జరిగితే మాత్రం శిక్ష మరింత కఠినంగా ఉంటుంది. రెండోసారి కూడా ఇదే తప్పు చేస్తే, కెప్టెన్‌కు రూ.24 లక్షల జరిమానాతో పాటు జట్టులోని ఇతర ఆటగాళ్లకు, ఇంపాక్ట్ ప్లేయర్ సహా, మ్యాచ్ ఫీజులో 25 శాతం లేదా రూ.6 లక్షలు జరిమానాగా విధిస్తారు. ఈ విషయంపై ఐపీఎల్ నిర్వాహకులు ఒక ప్రకటన విడుదల చేశారు. చెన్నైలో స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు కెప్టెన్ అజింక్య రహానేపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఆ జట్టు తొలి ఉల్లంఘన కావడంతో రూ.12 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.
వివరాలు
వికెట్లు పడగొట్టారిలా..
మ్యాచ్ విషయానికి వస్తే, ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఆ జట్టులో సంజూ శాంసన్ 48, డెవాల్డ్ బ్రెవిస్ 41, ఆయుష్ మాత్రే 38 పరుగులతో మెరుగైన ప్రదర్శన చేశారు. కేకేఆర్ బౌలర్లలో కార్తిక్ త్యాగి రెండు వికెట్లు తీసుకోగా, వైభవ్ అరోరా, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్ తలా ఒక్క వికెట్ సాధించారు. తర్వాత లక్ష్య చేధనకు దిగిన కేకేఆర్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 160 పరుగులకే పరిమితమైంది. సీఎస్‌కే బౌలర్లలో నూర్ అహ్మద్ మూడు వికెట్లు, అన్షుల్ రెండు వికెట్లు తీసుకోగా, ఖలీల్ అహ్మద్, అకీల్ హోసేన్ తలా ఒక్క వికెట్ సాధించారు.