జకోవిచ్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి అల్కరాజ్.. గ్రాస్ కోర్టుపై తొలి టైటిల్
టెన్నిస్‌లో నయా సంచలనంగా పేరొందిన కార్లోస్ అల్కరాజ్ మరో టైటిల్‌ను సాధించి సత్తా చాటాడు. క్వీన్స్ క్లబ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో గెలిచి తొలి గ్రాస్ కోర్టు టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సీజన్లో అతడికి ఇది ఐదో ఏటీపీ టైటిల్ కావడం విశేషం. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ అల్కరాజ్ 6-4, 6-4 తో అలెక్స్ డి మినౌర్ (ఆస్ట్రేలియా)పై గెలిచాడు. 99 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచులో అల్కరాజ్ ఏడు ఏస్‌లు సంధించడంతో పాటు ప్రత్యర్థి సర్వీసును రెండుసార్లు బ్రేక్ చేశాడు. ఈ విజయంతో అతను మళ్లీ నంబర్ 1 ర్యాంకును సొంతం చేసుకన్నాడు.
అల్కరాజ్ కు భారీ ఫ్రైజ్ మనీ
అల్కరాజ్ కు రూ.4 కోట్ల 26 లక్షల ప్రైజ్ మనీతో పాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. వచ్చే నెలలో ప్రారంభమయ్యే వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో టాప్ సీడర్‌గా అతను బరిలోకి దిగనున్నారు. క్వీన్స్ క్లబ్ ఫైనల్ మ్యాచుకు ముందు అల్కరాజ్ నంబర్ 1 స్థానం గురించి మాట్లాడాడు. టాప్ సీడ్ కోసం తాను పెద్దగా ఆలోచించడం లేదని, అయితే నోవక్ జకోవిచ్‌తో పోటీపడడం తనకు అదనపు మోటివేషన్ అని, నంబర్ 1 స్థానం కోసం తనకు, జకోవిచ్ మధ్య అందమైన పోటీ జరుగుతోందని పేర్కొన్నారు. నంబర్ 1 ఆటగాడిగా వింబుల్డన్ టోర్నమెంట్‌లో బరిలోకి దిగాలనేది తన కల అని అల్కారాజ్ పేర్కొన్నారు.