LOADING...
Amanpreet Singh Gill : క్రికెట్ ప్రపంచంలో విషాదం.. విరాట్ కోహ్లీ మాజీ సహచరుడు అమన్‌ప్రీత్ సింగ్ గిల్ మృతి
క్రికెట్ ప్రపంచంలో విషాదం.. విరాట్ కోహ్లీ మాజీ సహచరుడు అమన్‌ప్రీత్ సింగ్ గిల్ మృతి

Amanpreet Singh Gill : క్రికెట్ ప్రపంచంలో విషాదం.. విరాట్ కోహ్లీ మాజీ సహచరుడు అమన్‌ప్రీత్ సింగ్ గిల్ మృతి

వ్రాసిన వారు Moogati Shabari
May 07, 2026
11:51 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ వర్గాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. భారత మాజీ అండర్-19 క్రికెటర్, పంజాబ్‌కు చెందిన మీడియం పేసర్ అమన్‌ప్రీత్ సింగ్ గిల్ (36) బుధవారం చండీగఢ్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు. విరాట్ కోహ్లీతో కలిసి అండర్-19 స్థాయిలో ఆడిన అమన్‌ప్రీత్ ఆకస్మిక మరణం క్రికెట్ అభిమానులను, క్రీడా వర్గాలను షాక్‌కు గురిచేసింది. అమన్‌ప్రీత్ సింగ్ గిల్ పంజాబ్ జట్టు తరఫున ఆరు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి మొత్తం 11 వికెట్లు సాధించారు. 2008లో ప్రారంభమైన ఐపీఎల్ తొలి సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో సభ్యుడిగా చోటు సంపాదించారు. అనంతరం పంజాబ్ సీనియర్ సెలక్షన్ కమిటీలో సభ్యుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.

వివరాలు

ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి..

2007లో భారత అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అమన్‌ప్రీత్ ఐదు యూత్ వన్డేలు, ఒక యూత్ టెస్టు మ్యాచ్ ఆడారు. ఆ టెస్టులో శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్ తిసారా పెరీరా వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే 2008లో విరాట్ కోహ్లీ నాయకత్వంలో ప్రపంచకప్ గెలిచిన భారత అండర్-19 జట్టులో ఆయనకు అవకాశం రాలేదు. అమన్‌ప్రీత్ మృతి పట్ల పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. "పంజాబ్ మాజీ క్రికెటర్, సీనియర్ సెలక్షన్ కమిటీ సభ్యుడు అమన్‌ప్రీత్ సింగ్ గిల్ మరణం మాకు తీవ్ర వేదన కలిగించింది. ఆయన కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం" అని పీసీఏ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో పేర్కొంది.

వివరాలు

విచారం వ్యక్తం చేస్తున్న క్రికెటర్లు..

భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కూడా అమన్‌ప్రీత్ మృతి పట్ల సంతాపం తెలిపారు. "అమన్‌ప్రీత్ సింగ్ గిల్ మరణ వార్త విని చాలా బాధపడ్డాను. కెరీర్ ప్రారంభ దశలో మేమిద్దరం ఒకే డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్నాం. ఆయన ఎంతో నిశ్శబ్దంగా, అంకితభావంతో ఆడే క్రికెటర్. ఆయన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు నా హృదయపూర్వక సానుభూతి. ఓం శాంతి" అని యువరాజ్ 'ఎక్స్'లో రాశారు. ఇక పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ కూడా తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అమన్‌ప్రీత్ సింగ్ గిల్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసింది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న పోస్ట్: 

Advertisement