ఆధ్యాత్మిక నగరంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం.. కాశిలో శివుడి ఆకారంలో నిర్మాణం
కేంద్ర ప్రభుత్వం మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆధ్యాత్మిక నగరమైన కాశీలో అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శివుడి ఆకారంలో ఈ స్టేడియాన్ని నిర్మించనున్నారు. ఈ స్టేడియానికి సెప్టెంబర్ 23వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. శివుడి థీమ్‌తో ఈ స్టేడియాన్ని ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేశారు. డోమ్ ఢమరుకంలా, ఫ్లడ్ లైట్స్ త్రిశూలంలా, ఎంట్రన్స్ డిజైన్ బెల్పాత్రా మొక్కలతో తీర్చిదిద్దనున్నారు. ఇక ప్రేక్షకుల కోసం గంగా ఘాట్ మెట్ల వంటి సీటింగ్ ఉండనుంది.
రూ.400 కోట్లతో స్టేడియం నిర్మాణం
31 ఎకరాల్లో ఈ స్టేడియాన్ని నిర్మించనున్నారు. ఈ స్టేడియం 30,000 మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ స్టేడియానికి రూ.400 కోట్లు ఖర్చు పెట్టనున్నారు. అంతే కాకుండా ప్రాక్టీస్ నెట్, ప్లే ఫీల్డ్, లాంజ్, కామెంటరీ బాక్స్, ప్రెస్ గ్యాలరీ, ప్రధాన మైదానం వెలుపల అదనపు చిన్న గ్రౌండ్, పార్కింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉండనుంది. ఈ స్టేడియం పైకప్పు శివుని నుదుటిపై కూర్చున్న చంద్రవంకలాగా కనిపించనుంది.