అమెరికా జట్టుకు ఊహించని షాక్.. బౌలర్‌పై సస్పెన్షన్ వేటు
వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2023లో అమెరికా జట్టుకు ఊహించిన షాక్ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ కైల్ పిలిప్ పై సస్పెన్షన్ వేటు పడింది. కైల్ పిలిప్ బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ ప్యానెల్ స్పష్టం చేసింది. అతనిపై విధించిన నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఆర్టికల్ 6.7 రెగ్యులేషన్స్ ప్రకారం కైల్ పిలిప్ బౌలింగ్ యాక్షన్ పై అనుమానం ఉందని, అతని బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించామని, తన బౌలింగ్‌కు సంబంధించిన రీఅసెస్‌మెంట్ జరిగే వరకు కైల్ పిలిప్‌పై సస్పెన్షన్ కొనసాగుతుందని ఐసీసీ పేర్కొంది. ఇప్పటివరకూ ఐదు వన్డేలు ఆడిన కైల్ పిలిప్ ఆరు వికెట్లు పడగొట్టాడు.
మేజర్ క్రికెట్ లీగ్ దూరం కానున్న కైల్ పిలిప్
వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2023 టోర్నీలో భాగంగా వెస్టిండీస్‌తో అమెరికా తొలి మ్యాచ్ ఆడింది. మ్యాచులో యూఎస్ఏ ఓడినప్పటికీ పిలిప్ మూడు వికెట్లను పడగొట్టాడు. కాగా ఈ టోర్నీలో హ్యాట్రిక్ ఓటములు నమోదు చేసిన అమెరికా దాదాపు నిష్క్రమించింది. కైల్ పిలిప్‌పై నిషేధం పడడంతో వచ్చే నెలలో ప్రారంభం కానున్న మేజర్ క్రికెట్ టోర్నీలో ఆడేది అనుమానంగానే కనిపిస్తోంది. ముంబై ఇండియన్స్ న్యూయార్క్ జట్టు కైల్ పిలిప్‌ను 10వేల యూస్ డాలర్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.