IND w Vs AUS w: కంగారూల గడ్డపై మరో సవాల్.. వన్డే సిరీస్‌పై కన్నేసిన టీమిండియా
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియా గడ్డపై పదేళ్ల తర్వాత టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా ఇప్పుడు వన్డే సమరానికి సిద్ధమైంది. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన భారత్.. కంగారూలతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మంగళవారం ప్రారంభించనుంది. స్వదేశంలో ప్రపంచకప్‌ను గెలుచుకున్న తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత్ ఆడుతున్న తొలి వన్డే సిరీస్ ఇదే కావడం విశేషం. టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణించిన స్టార్ ఓపెనర్ స్మృతి మంధానపై ఈ సిరీస్‌లోనూ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. స్మృతి స్థిరంగా ఆడుతున్నప్పటికీ, మరో ఓపెనర్ షెఫాలీ వర్మ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
Details
ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయడం భారత్‌కు ప్రమాదకరమే
ఆసీస్‌పై పైచేయి సాధించాలంటే మిడిల్ ఆర్డర్‌లో జెమియా, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, అలాగే వికెట్‌కీపర్ బ్యాటర్ రిచా గౌస్ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. టీ20 సిరీస్‌లో మెరిసిన శ్రీచరణి వన్డేల్లో ఎలా రాణిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. వైష్ణవి శర్మపై కూడా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. స్వదేశంలో ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయడం భారత్‌కు ప్రమాదకరమే. కెప్టెన్ హీలీ నాయకత్వంలోని ఆసీస్ జట్టు అనుభవజ్ఞులతో నిండిపోయి ఉంది. అందులో ఎల్లీస్ పెర్రీ, సోఫీ మోలినెక్స్, ఆష్లీ గార్డనర్, జార్జియా వేర్‌హామ్, బెత్ మూనీ, తహ్లియా మెక్‌గ్రాత్ లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. వన్డే సిరీస్‌లోనూ ఆధిపత్యం చాటాలన్న లక్ష్యంతో భారత్ బరిలోకి దిగుతుండగా, స్వదేశంలో రాణించాలని ఆస్ట్రేలియా పట్టుదలతో ఉంది.