Archery: ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-3లో భారత్‌కు స్వర్ణ పతకం.. నాలుగేళ్ల నిరీక్షణకు తెర
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-3లోని రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో భారత జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్ పోరులో ఒలింపిక్ విజేతలైన దక్షిణ కొరియా జట్టును భారత ఆర్చర్లు ధీరజ్ బొమ్మదేవర, కుంకుమ్ మొహోద్ జోడీ ఓడించి అగ్రస్థానంలో నిలిచారు. ఓహ్ యే-జిన్, కిమ్ జె-డివోక్‌లతో జరిగిన తుదిపోరులో భారత్ 5-1 తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. పోటీ ప్రారంభం నుంచే భారత జోడీ ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి రెండు రౌండ్లలో వరుసగా 37-36, 37-36 స్కోర్లతో ముందంజలో నిలిచింది. మూడో రౌండ్ కూడా హోరాహోరీగా సాగగా, ఇరు జట్లు 39-39 స్కోరుతో సమంగా ముగించాయి. దీంతో మొత్తం స్కోరులో భారత్ విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.
వివరాలు
నాలుగేళ్ల తర్వాత ఇలా..
మిక్స్‌డ్ టీమ్ విభాగంలో ధీరజ్ బొమ్మదేవర, కుంకుమ్ మొహోద్‌లకు ఇది తొలి ప్రపంచకప్ స్వర్ణ పతకం కావడం విశేషం. అలాగే ఈ విభాగంలో భారత్ నాలుగేళ్ల తర్వాత ప్రపంచకప్ స్టేజ్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. అంతకుముందు 2022లో జరిగిన పోటీల్లో రిధి ఫోర్, తరుణ్‌దీప్ రాయ్ జోడీ భారత్‌కు స్వర్ణ పతకం అందించింది. ఇదిలా ఉండగా, వ్యక్తిగత విభాగంలో కూడా ధీరజ్ బొమ్మదేవర అద్భుత ప్రదర్శన కొనసాగిస్తూ సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. ఫైనల్ బెర్త్ కోసం అతడు నేడు జర్మనీకి చెందిన మారిట్జ్ వీజర్‌తో తలపడనున్నాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే ధీరజ్‌కు కనీసం రజత పతకం ఖాయమవడంతో పాటు స్వర్ణ పతకం కోసం పోటీ పడే అవకాశం లభించనుంది.