IND Vs AUS: కోహ్లీ, కాన్‌స్టాస్ మధ్య వాగ్వాదం.. చర్యలు తీసుకోవాలని కోరిన పాంటింగ్, మైకెల్ వాన్
బాక్సింగ్ డే టెస్టు సందర్భంగా భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆసీస్ యువ క్రికెటర్ సామ్ కాన్‌స్టాస్ మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. సామ్ కాన్‌స్టాస్‌ను కోహ్లీ భుజం తాకుతూ నడిచి వెళ్లడం ఈ వివాదానికి కారణమైంది. అంపైర్లు, మరో బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ స్పందించారు. కామెంటరీ బాక్స్‌లో ఉన్న వాన్, పాంటింగ్ ఈ ఘటనపై విమర్శలు గుప్పించారు. 'కాన్‌స్టాస్ తన దారిన వెళ్తున్నాడు. విరాట్ కోహ్లీ ఉద్దేశపూర్వకంగా భుజం తాకినట్లు కనిపిస్తోంది.
సర్దిచెప్పిన అంపైర్లు
అతను అనుభవజ్ఞుడు, గొప్ప ఆటగాడు అయినా, ఈ తీరు బాధించేదిగా ఉందని వాన్ వ్యాఖ్యానించాడు. రికీ పాంటింగ్ మాట్లాడుతూ ఈ ఘటన మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ పరిశీలనకు వస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. జస్‌ప్రీత్ బుమ్రా 11వ ఓవర్ వేస్తుండగా, కోహ్లీ వద్దకు బాల్ వచ్చింది. దానిని నాన్‌స్ట్రైకర్ వైపు తీసుకెళ్లిన సమయంలో కోహ్లీ, కాన్‌స్టాస్ ఎదురుపడ్డారు. భుజాలు తాకడంతో కాన్‌స్టాస్ ఏమో వ్యాఖ్యలు చేశాడు. దీనికి కోహ్లీ కూడా వెంటనే ప్రతిస్పందించాడు. కొద్దిసేపు వాగ్వాదం కొనసాగడంతో ఉస్మాన్ ఖవాజా, అంపైర్లు మద్దతుగా నిలిచి పరిస్థితిని సర్దిచెప్పారు.
ఉద్దేశపూర్వకంగా ఆటగాడిని తాకడం నేరం
ఐసీసీ చట్టం 2.12 ప్రకారం, ఉద్దేశపూర్వకంగా ఆటగాడిని లేదా ఇతర వ్యక్తిని తాకడం శిక్షార్హం. దీనికి సంబంధించి మ్యాచ్ నిషేధం లేదా డీమెరిట్ పాయింట్లు విధించే అవకాశం ఉంది. అయితే కోహ్లీ తన తప్పును అంగీకరిస్తే పాత రికార్డుల ఆధారంగా డీమెరిట్ పాయింట్లతో బయటపడతాడని విశ్లేషకుల అభిప్రాయం. ఈ ఘటన క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశమైంది. ఐసీసీ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంటే ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.