అర్జున్ టెండుల్కర్ ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాడు : పాక్ మాజీ క్రికెటర్
సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్ టెండుల్కర్ ఎట్టకేలకు ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు ఆడాడు. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఐపీఎల్ లో అడుగుపెట్టిన అర్జున్ ఆ మ్యాచ్ లో పెద్దగా రాణించలేకపోయారు. తర్వాతి సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో భువనేశ్వర్ కుమార్ వికెట్ తీసి ఐపీఎల్ లో తన తొలి వికెట్ ను ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం పలువురు మాజీ క్రికెటర్లు అర్జున్ ను ప్రశంసించారు. అయితే అతని బౌలింగ్ వేగం చాలా తక్కువగా ఉండటంతో సోషల్ మీడియాలో అభిమానులు అతన్ని ట్రోల్ చేశారు. ప్రస్తుతం పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ ఈ అంశంపై మాట్లాడారు.
అర్జున్ టెండుల్కర్ ఇంకా కష్టపడాలి
అర్జున్ టెండుల్కర్ ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాడని, ఇంకా చాలా కష్టపడాలని, అతని బౌలింగ్ పొజిషన్ సరిగా లేనందున, సరిపడా పేస్ జనరేట్ కావడం లేదని రషీద్ లతీఫ్ పేర్కొన్నాడు. ఓ మంచి బయోమెకానికల్ కన్సల్టెంట్ అతనికి మార్గనిర్దేశం చేస్తే, అర్జున్ మరింత వేగంగా బంతిని విసిరే అవకాశం ఉందన్నాడు. భవిష్యతులో 135 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తాడని, వచ్చే రెండు, మూడేళ్లలో ఓ మంచి ప్లేయర్ అవుతాడని ఆయన జోస్యం చెప్పాడు.