LOADING...
Arjun Tendulkar: వాంఖడేలో సత్తా చాటిన అర్జున్ టెండూల్కర్ .. బ్యాట్, బంతితో అల్ రౌండర్ ప్రదర్శన
వాంఖడేలో సత్తా చాటిన అర్జున్ టెండూల్కర్ .. బ్యాట్, బంతితో అల్ రౌండర్ ప్రదర్శన

Arjun Tendulkar: వాంఖడేలో సత్తా చాటిన అర్జున్ టెండూల్కర్ .. బ్యాట్, బంతితో అల్ రౌండర్ ప్రదర్శన

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 09, 2026
09:54 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ టీ20 ముంబై లీగ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరిశాడు. బంతితోనూ, బ్యాట్‌తోనూ అదరగొట్టి తన జట్టు ఏఆర్‌సీఎస్ అంధేరికి ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. సోమవారం ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా బాంద్రా బ్లాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జున్ అద్భుత ప్రదర్శన కనబరిచి మ్యాచ్ హీరోగా నిలిచాడు. ముందుగా బౌలింగ్‌లో తన లెఫ్ట్ ఆర్మ్ పేస్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన అర్జున్, కేవలం 3 ఓవర్లు వేసి ఒక మెయిడెన్‌తో పాటు 11 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు తీసి బాంద్రా బ్లాస్టర్స్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు.

వివరాలు

మూడో స్థానంలో బ్యాటింగ్

అర్జున్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు తోడు మిగతా బౌలర్లు కూడా రాణించడంతో ప్రత్యర్థి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓమ్ కేశ్‌కామత్ 49, సాగర్ ఛబ్రియా 44 పరుగులు చేసినప్పటికీ జట్టుకు భారీ స్కోరు అందించలేకపోయారు. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఏఆర్‌సీఎస్ అంధేరి తరఫున మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అర్జున్ టెండూల్కర్ దూకుడైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 25 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసిన అతడు, మొత్తం 34 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 5 భారీ సిక్సర్ల సాయంతో అజేయంగా 66 పరుగులు సాధించాడు.

వివరాలు

రాణించిన ముషీర్ ఖాన్

మరో ఎండ్‌లో ముషీర్ ఖాన్ కూడా 38 బంతుల్లో 54 పరుగులతో నాటౌట్‌గా నిలిచి అర్జున్‌కు చక్కటి సహకారం అందించాడు. ఈ ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు అజేయంగా 116 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో అంధేరి జట్టు కేవలం 13.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సచిన్ టెండూల్కర్ కుమారుడిగా భారీ అంచనాలు, ఒత్తిడిని ఎదుర్కొంటున్న అర్జున్‌కు ఈ ప్రదర్శన ఎంతో కీలకంగా మారింది. ముఖ్యంగా ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున అతడికి పెద్దగా అవకాశాలు రాకపోయిన నేపథ్యంలో, ఇలాంటి దేశవాళీ టోర్నీల్లో రాణించడం అతడి కెరీర్‌కు ఎంతో ఉపయోగపడనుంది.

Advertisement

వివరాలు

అర్జున్ కి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు

తన తండ్రి సచిన్ టెండూల్కర్ ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందుకున్న వాంఖడే స్టేడియంలోనే అర్జున్ ఈ స్థాయి ఆల్‌రౌండ్ ప్రదర్శన చేయడం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ అద్భుత ప్రదర్శనకు గుర్తింపుగా అతడికి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.

Advertisement