Page Loader
ENG vs IND: అర్ష్‌దీప్‌కు గాయం.. భారత జట్టులోకి అన్షుల్‌ కాంబోజ్‌ ఎంట్రీ!
అర్ష్‌దీప్‌కు గాయం.. భారత జట్టులోకి అన్షుల్‌ కాంబోజ్‌ ఎంట్రీ!

ENG vs IND: అర్ష్‌దీప్‌కు గాయం.. భారత జట్టులోకి అన్షుల్‌ కాంబోజ్‌ ఎంట్రీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 20, 2025
10:08 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశవాళీ క్రికెట్‌లో తన ప్రతిభను చాటిన యువ ఆల్‌రౌండర్ అన్షుల్ కాంబోజ్‌కు భారత జట్టులో అవకాశం దక్కింది. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమ్‌ఇండియా జట్టులో అతను చేరనున్నాడు. ఇప్పటికే సిరీస్‌లో రెండు టెస్టులు మిగిలి ఉండగా, నాలుగో టెస్టు బుధవారం నుంచి మాంచెస్టర్‌లో ప్రారంభం కానుంది. అన్షుల్ ఇటీవల ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన రెండు అనధికార టెస్టుల్లో భారత్‌ A తరఫున ఆడి ఐదు వికెట్లు తీసాడు. అంతేకాక ఒక హాఫ్ సెంచరీ కూడా బాదాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన అన్షుల్, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 24 మ్యాచ్‌లు ఆడి 79 వికెట్లు పడగొట్టాడు. టెయిలెండర్‌గా మంచి బ్యాటింగ్ చేయగల సమర్థత అతని ప్రత్యేకత.

Details

బుమ్రాకు విశ్రాంతినిచ్చే అవకాశం

నాలుగో టెస్టుకు ముందు జట్టులో కొన్ని మార్పులు జరుగుతాయన్న ఊహాగానాలు ఉన్నప్పటికీ, బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నారన్న వార్తలపై స్పష్టత లేకపోయింది. మరోవైపు యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌కు గాయం కావడంతో అతడి స్థానంలో అన్షుల్‌ను తీసుకున్నట్లు సమాచారం. ప్రాక్టీస్ సమయంలో బంతిని ఆపే ప్రయత్నంలో అర్ష్‌దీప్ చేతికి గాయమైనట్టు తెలుస్తోంది. ఆయనను స్వదేశానికి పంపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై బీసీసీఐ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అర్జున్‌ కాంబోజ్‌ను ఎంపిక చేసినా, అతనికి అంతర్జాతీయ స్థాయిలో అనుభవం లేకపోవడం ఓ మైనస్‌గా మారే అవకాశం ఉంది.

Details

నాలుగో టెస్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు

మరోవైపు ఇప్పటికే సిరీస్‌లో 1-2 తేడాతో వెనుకబడిన భారత్ నాలుగో టెస్టులో తుది జట్టు విషయంలో పెద్దగా మార్పులు చేయనప్పటికీ, పేసర్లలో ఒక్కరికి విశ్రాంతి ఇచ్చి స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌కు ఛాన్స్ ఇవ్వొచ్చని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. బుమ్రా లేదా సిరాజ్.. వారిలో ఎవరికీ విశ్రాంతి ఇచ్చే విషయంపై జట్టు మేనేజ్‌మెంట్‌లో చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ భారత్ నాలుగో టెస్టు గెలిస్తే, ఐదో టెస్టుకు బుమ్రాకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంటుంది. అవసరమైతే ఐదో టెస్టులోనూ బుమ్రా ఆడే అవకాశాన్ని తిప్పి చెప్పలేం. మొత్తంగా నాలుగో టెస్టు జట్టు ఎంపిక ఇప్పుడు జట్టును సిద్ధం చేస్తున్న మేనేజ్‌మెంట్‌కు పెద్ద సవాలుగా మారింది.