
Asia Cup 2025: యూఏఈ వేదికగా ఆసియా కప్ ప్రారంభం.. భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
క్రికెట్ అభిమానులు ఆసియా కప్ 2025 షెడ్యూల్‌పై ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ.. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ సెప్టెంబర్ 5న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా ప్రారంభం కానుంది. ఈసారి టీ20 ఫార్మాట్‌లో నిర్వహించనున్న ఈ కప్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్ సెప్టెంబర్ 7న జరగనుందని విశ్వసనీయ సమాచారం చెబుతోంది. భారత్, పాకిస్థాన్ మధ్య రాజకీయ ఉద్రిక్తతల వల్ల గత కొంతకాలంగా మ్యాచ్‌లు నిర్వహించడంపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. అయితే, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్(ACC) ఈ టోర్నీ విజయవంతంగా జరగాలన్న లక్ష్యంతో పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. టోర్నమెంట్ నిర్వహణపై తుది నిర్ణయాన్ని, పూర్తి షెడ్యూల్‌ను జూలై తొలి వారంలో ప్రకటించే అవకాశం ఉందని క్రికెట్ వర్గాల సమాచారం.
Details
తటస్థ వేదికగా యూఏఈ ఎంపిక
ఈ ఏడాది ఆసియా కప్‌కు భారత్ ఆతిథ్య దేశంగా వ్యవహరించాల్సి ఉన్నప్పటికీ, భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ సంబంధాల నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని యూఏఈని తటస్థ వేదికగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గతంలోనూ ఇలాంటి సందర్భాల్లో తటస్థ వేదికలు ఎన్నుకోవడం చూసాం. ఆసియా కప్ 2025లో మొత్తం ఆరు జట్లు పాల్గొననున్నాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ జట్లు ఈ టోర్నీలో బరిలోకి దిగనున్నాయి. ఈ టోర్నీ గ్రూప్ స్టేజ్, సూపర్ ఫోర్స్ ఫార్మాట్‌లో నిర్వహించనున్నారని సమాచారం. దీనివల్ల భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య కనీసం రెండు మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇందులో ఒకటి సెప్టెంబర్ 7న కాగా, మరొకటి సెప్టెంబర్ 14న జరుగవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Details
అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూపులు
ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ సంబంధాలు మరింత తారాస్థాయికి చేరాయి. దీంతో ఈ టోర్నమెంట్ జరుగుతుందా? అన్న సందేహాలు మొదలయ్యాయి. కానీ ఇటీవల ఐసీసీ విడుదల చేసిన మహిళల వన్డే, టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్స్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లను చేర్చడం గమనించాల్సిన విషయం. ఈ పరిణామం, అంతర్జాతీయ టోర్నీల్లో అయినా ఇరు దేశాల మధ్య క్రికెట్ కొనసాగుతుందని సంకేతం ఇస్తోంది. మొత్తంగా చూస్తే, ఆసియా కప్ 2025 షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన కోసం క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా భారత్-పాక్ గరిష్ట ఉత్కంఠ నింపే మ్యాచ్‌లు ఎప్పుడు జరుగుతాయనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.