LOADING...
Axar Patel: అక్షర్‌ను తీసుకోకపోవడానికి కారణం చెప్పిన అసిస్టెంట్‌ కోచ్
అక్షర్‌ను తీసుకోకపోవడానికి కారణం చెప్పిన అసిస్టెంట్‌ కోచ్

Axar Patel: అక్షర్‌ను తీసుకోకపోవడానికి కారణం చెప్పిన అసిస్టెంట్‌ కోచ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 23, 2026
12:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

సూపర్‌ 8 దశలో టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది. దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీ20 జట్టు వైస్‌ కెప్టెన్‌ అక్షర్ పటేల్‌ను పక్కనబెట్టి వాషింగ్టన్ సుందర్‌కు తుదిజట్టులో చోటు కల్పించారు. అయితే బౌలింగ్‌, బ్యాటింగ్‌ రెండు విభాగాల్లోనూ సుందర్‌ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాడు. రెండు ఓవర్లు బౌలింగ్‌ చేసిన సుందర్‌ 17 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. ఇక జట్టు కష్టాల్లో ఉన్న కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చి 11 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌ చేరాడు. దీంతో అక్షర్‌ పటేల్‌ను ఆడించి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని టీమిండియా అభిమానులు సోషల్‌మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Details

తుది జట్టు ఎంపిక సవాల్ గా మారింది

ఈ ఎంపికపై భారత జట్టు అసిస్టెంట్‌ కోచ్‌ ర్యాన్‌ టెన్‌ స్పందించాడు. జట్టు కూర్పు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించాడు. 'ప్లేయింగ్‌ ఎలెవన్‌పై మేం కొన్ని రోజులుగా లోతుగా చర్చించాం. జట్టులో వైవిధ్యం తీసుకురావాలనే ఉద్దేశంతో వాషింగ్టన్‌ సుందర్‌ను ఎంపిక చేశాం. బ్యాటింగ్‌ డెప్త్‌ కోసం రింకు సింగ్‌ను కొనసాగించాం. అయితే అక్షర్‌ పటేల్‌ ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదు. అతడు మా జట్టుకు కీలకమైన ఆటగాడు' అని ర్యాన్‌ టెన్‌ పేర్కొన్నాడు. అలాగే తుది జట్టు ఎంపిక ప్రక్రియ సవాలుగా మారిందని తెలిపాడు. 'మా దగ్గర 15 మంది ఆటగాళ్లు ఉన్నారు. అందులో 11 మందిని ఎంపిక చేయడం అంత సులభం కాదు.

Details

సంజు శాంసన్‌కు ఛాన్స్‌?

ఆటగాళ్లు ఈ పరిస్థితిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. అక్షర్‌ పటేల్‌ కూడా ఇదే స్ఫూర్తితో తీసుకుంటాడని నమ్ముతున్నానని చెప్పాడు. ఇదే సమయంలో సంజు శాంసన్ మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశాలపై కూడా ర్యాన్‌ టెన్‌ సంకేతాలు ఇచ్చాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ, 'ప్రస్తుతం జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నారు. కానీ అంతర్జాతీయ అనుభవం పరిమితంగానే ఉంది. సంజు శాంసన్‌ అద్భుతమైన ఆటగాడు. టాప్‌ ఆర్డర్‌లో కుడిచేతి వాటం బ్యాటర్‌గా వ్యూహాత్మకంగా ఆడగలడు. కీలకమైన మ్యాచ్‌ల నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారే అవకాశముందని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలతో రాబోయే మ్యాచ్‌ల్లో సంజు శాంసన్‌కు తుదిజట్టులో చోటు దక్కే అవకాశం ఉందన్న సంకేతాలు స్పష్టమయ్యాయి.

Advertisement