PSL: పాక్‌కు వెళ్లొచ్చు.. కానీ పెషావర్‌కు మాత్రం నో : ఆస్ట్రేలియా హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌కు వెళ్లేందుకు అనుమతి ఉన్నా, ఒక నగరానికి మాత్రం వెళ్లొద్దని ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ క్రికెటర్లకు హెచ్చరికలు జారీ చేసింది. మార్చి 26 నుంచి పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, లబుషేన్, మాక్స్‌వెల్ వంటి ఆస్ట్రేలియా క్రికెటర్లు పాల్గొననున్నారు. అదేవిధంగా టిమ్ పైన్, గిలెస్పీ వంటి మాజీ ఆటగాళ్లు కోచ్‌లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ లీగ్ నిర్వహణపై సందేహం నెలకొంది. ఇటీవల పాకిస్థాన్ సైన్యం అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లోని ఒక ఆసుపత్రిపై దాడి జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సుమారు 400 మంది నిరపరాధులు ప్రాణాలు కోల్పోయారు.
వివరాలు
నో ట్రావెల్ జోన్‌గా ఆ నగరం
ఈ పరిణామాల నేపథ్యంలో, ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ క్రికెటర్లకు పాకిస్థాన్‌కు వెళ్లవచ్చని అనుమతించినప్పటికీ, పెషావర్ నగరానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదని స్పష్టంగా ఆదేశించింది. పెషావర్‌ను "నో ట్రావెల్ జోన్"గా ప్రకటించడం ఇందుకు కారణం. అయితే, మార్చి 28న పెషావర్‌లోని ఇమ్రాన్ ఖాన్ స్టేడియంలో పెషావర్ జల్మీ, రావల్పిండి జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ రెండు జట్లలోనూ ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఉన్నారు. పెషావర్ జల్మీ తరపున ఆరోన్ హార్డీ, రావల్పిండి జట్టుకు జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ పరిస్థితుల వల్ల ప్రస్తుతం అయోమయం నెలకొంది. అత్యవసర పరిస్థితులు తలెత్తితే, ఆస్ట్రేలియా ఆటగాళ్లను ప్రైవేట్ విమానాల ద్వారా స్వదేశానికి తరలిస్తామని ఆస్ట్రేలియా ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు సమాచారం.