LOADING...
Kane Richardson: ప్రొఫెషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఆస్ట్రేలియా స్టార్ బౌలర్
ప్రొఫెషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఆస్ట్రేలియా స్టార్ బౌలర్

Kane Richardson: ప్రొఫెషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఆస్ట్రేలియా స్టార్ బౌలర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 27, 2026
03:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్‌ కేన్‌ రిచర్డ్‌సన్‌ ప్రొఫెషనల్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. దీంతో 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ఆయన ముగింపు పలికినట్లైంది. ప్రస్తుతం 34 ఏళ్ల వయసున్న రిచర్డ్‌సన్‌.. 2021లో టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న ఆస్ట్రేలియా జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. అలాగే 2019 వన్డే ప్రపంచకప్‌లోనూ ఆసీస్‌ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించాడు. బిగ్‌బాష్‌ లీగ్‌ (BBL) చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన బౌలర్లలో కేన్‌ రిచర్డ్‌సన్‌ ఒకడు. ప్రస్తుత సీజన్‌ కోసం సిడ్నీ సిక్సర్స్‌తో ఏడాది ఒప్పందంపై సంతకం చేసిన ఆయన.. రిటైర్మెంట్‌ ప్రకటించే ముందు కేవలం రెండు మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. బీబీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రిచర్డ్‌సన్‌ ఐదో స్థానంలో నిలిచాడు.

Details

మెల్‌బోర్న్‌ తరుపున 80 మ్యాచులు

మొత్తం 15 సీజన్లలో 142 వికెట్లు పడగొట్టాడు. ఈ కాలంలో అడిలైడ్‌ స్ట్రైకర్స్‌, మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌, సిడ్నీ సిక్సర్స్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2018-19 సీజన్‌లో బీబీఎల్‌ టైటిల్‌ను గెలుచుకున్న మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌ జట్టుకు రిచర్డ్‌సన్‌ కీలక ఆటగాడిగా నిలిచాడు. మెల్‌బోర్న్‌ జట్టుకు తరఫున 80 మ్యాచ్‌లు ఆడి 104 వికెట్లు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియా తరఫున 25 వన్డేలు, 36 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. కుడిచేతి ఫాస్ట్‌ బౌలర్‌ అయిన రిచర్డ్‌సన్‌ వన్డేల్లో 39 వికెట్లు, టీ20 అంతర్జాతీయాల్లో 45 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కేన్‌ రిచర్డ్‌సన్‌ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా రిటైర్మెంట్‌ను ప్రకటించాడు.

Details

ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు : రిచర్డ్‌సన్

ఈ సందర్భంగా ఆస్ట్రేలియన్‌ క్రికెటర్స్‌ అసోసియేషన్‌ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. తన కెరీర్‌ మొత్తం కాలంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ రిచర్డ్‌సన్‌ కృతజ్ఞతలు తెలిపాడు. ఆస్ట్రేలియా తరఫున మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు టీ20 లీగ్‌లలో కూడా కేన్‌ రిచర్డ్‌సన్‌ తన ప్రతిభను చాటుకున్నాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)లో నాలుగు సీజన్లు ఆడాడు. అలాగే టీ20 బ్లాస్ట్‌, ఐఎల్‌టీ20, ది హండ్రెడ్‌ వంటి ప్రముఖ లీగ్‌లలోనూ రాణించి గుర్తింపు పొందాడు.

Advertisement