MS Dhoni Ruled Out IPL: సీఎస్కే అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఐపీఎల్ మ్యాచులకు ధోని దూరం!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే అభిమానులకు నిరాశ కలిగించే వార్త బయటకు వచ్చింది. టీమిండియా లెజెండరీ ఆటగాడు, ఎంఎస్ ధోని, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున తొలి రెండు వారాలకు దూరంగా ఉండనున్నాడు. పిక్క కండరాల గాయంతో బాధపడుతున్న ఎంఎస్ ధోని టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని జట్టు అధికారికంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. సీఎస్కే విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ప్రస్తుతం ధోనీ గాయం నుంచి కోలుకునేందుకు రిహాబిలిటేషన్‌లో ఉన్నాడు. సీజన్ ప్రారంభ దశలో అతని సేవలు జట్టుకు దొరకకపోవచ్చని తెలిపింది. చెన్నై జట్టు మార్చి 30న గువాహటిలో రాజస్థాన్ రాయల్స్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈకీలక మ్యాచ్‌లో ధోనీ లేకపోవడం జట్టుకు పెద్ద లోటుగా మారనుంది.
వివరాలు
అత్యధిక మ్యాచులాడిన ఆటగాడిగా రికార్డు
ఈ ఏడాది 45 ఏళ్లకు చేరుకోనున్న ధోనీ.. సీఎస్‌కే జట్టులో ఉన్న నలుగురు వికెట్ కీపర్లలో ఒకరు. అతనితో పాటు సంజు శాంసన్, కార్తిక్ శర్మ, ఉర్విల్ పటేల్ జట్టులో ఉన్నారు. ఐపీఎల్ చరిత్రలో 278 మ్యాచ్‌లు ఆడి అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా ధోనీ రికార్డు సృష్టించాడు. గత కొన్ని సంవత్సరాలుగా మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ, సీఎస్‌కేకు ధోనీ కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నాడు. అతను కోలుకునే ఈ రెండు వారాల్లో చెన్నై జట్టు పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లు ఆడనుంది. ఈ వార్తతో నిరాశ చెందిన అభిమానులు ధోనీ త్వరగా కోలుకుని మళ్లీ మైదానంలోకి రావాలని ఆశిస్తున్నారు.