Pakistan Team : ప్రపంచ కప్‌లో దారుణ ప్రదర్శన.. స్టాఫ్ మొత్తాన్ని తొలగించే దిశగా పాక్ క్రికెట్ బోర్డు!
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో పాకిస్థాన్ చెత్త ప్రదర్శనతో మూటకట్టుకుంది. ఈ టోర్నీలో లీగ్ దశలోనే పాకిస్థాన్ ఇంటిదారి పట్టింది. దీనిపై పాక్ మాజీ క్రికెటర్లు ఆ జట్టు సభ్యులపై విమర్శలను గుప్పించారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. విదేశీ కోచింగ్ స్టాఫ్ మొత్తాన్ని తొలగించే దిశగా పీసీబీ ప్రయత్నాలు చేస్తోందని పాక్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో టీమ్ డైరక్టర్ మిక్కి ఆర్థర్ ను కూడా పక్కన పెడతారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఈ టోర్నీలో బౌలింగ్ విభాగ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తన పదవికి రాజీనామా చేశారు.
బాబార్ కెప్టెన్సీపై వేటు పడే అవకాశం?
ఇక పాక్ కెప్టెన్ బాబార్ అజామ్ పై వేటు పడే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ప్రస్తుతం మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా ఉన్న బాబర్‌ని పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కెప్టెన్సీ నుంచి తప్పించాలని మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తానే స్వయంగా కెప్టెన్సీ నుంచి వైదొలగుతాడని మరోవైపు ప్రచారం జరుగుతోంది. కెప్టెన్సీ రేసులో షాహీన్ అఫ్రిది, షాన్ మసూద్, సర్ఫరాజ్ అహ్మద్ ఉన్నారు. రానున్న డిసెంబర్, జనవరి మాసాల్లో పాక్ జట్టు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో పర్యటించనుంది.