LOADING...
Liton Das: ఇది నాకు సురక్షితం కాదు,సమాధానం ఇవ్వలేను: బంగ్లా కెప్టెన్‌ లిటన్‌ దాస్
ఆ విషయంపై మాట్లాడటం నాకు సురక్షితం కాదు: బంగ్లా కెప్టెన్‌ లిటన్‌ దాస్

Liton Das: ఇది నాకు సురక్షితం కాదు,సమాధానం ఇవ్వలేను: బంగ్లా కెప్టెన్‌ లిటన్‌ దాస్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 21, 2026
10:58 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్ 2026 టీ20 వరల్డ్ కప్ వివాదంపై స్పందించడానికి నిరాకరించారు. ఈ టోర్నీకి తాను సురక్షితంగా లేనట్లు లిటన్ వివరించారు. మెగా టోర్నీ ప్రారంభానికి ఇంకా కేవలం రెండు వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే, బంగ్లాదేశ్ పాల్గొనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. భద్రతా కారణాలను ఆశ్రయిస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తమ మ్యాచ్‌లను భారత్ నుండి శ్రీలంకకు మార్చమని ఐసీసీ (ICC) కు అభ్యర్థించగా, తక్కువ సమయం ఉన్న కారణంగా వేదికలను మార్చడం కష్టమని ఐసీసీ సంకేతాలు ఇచ్చినట్లు వార్తలు ఉన్నాయి. ఇప్పటివరకు ఐసీసీ, బీసీబీ అధికారులు రెండుసార్లు సమావేశమయ్యారు, కానీ అధికారిక ప్రకటన విడుదల కాలేదు.

వివరాలు 

అది నాకు సురక్షితం కాదు: లిటన్‌దాస్

బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో మ్యాచ్‌ అనంతరం లిటన్‌దాస్‌ వరల్డ్‌కప్‌లో తమ జట్టు పాల్గొనే అంశమై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చాడు. "మీరు మేం వరల్డ్‌ కప్‌ ఆడబోతున్నాం అనుకుంటున్నారా? నాకు స్పష్టత లేదు. నాకే కాదు.. ఎవరికి స్పష్టత లేదు. నా అభిప్రాయం ప్రకారం, ఇప్పటివరకు బంగ్లాదేశ్ జాతికి కూడా స్పష్టత లేదు. నేనేం సమాధానం చెప్పలేను. మీరు ఏం అడగాలనుకుంటున్నారో తెలుసు, కానీ అది నాకు సురక్షితం కాదు. సమాధానం చెప్పను' అని లిటన్‌ దాస్‌ అన్నాడు. భారతదేశంలో జరిగే టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ పాల్గొనే విషయంలో ఐసీసీ నిర్ణయం గడువు విధించిందని ఇప్పటికే తెలిసిందే.

వివరాలు 

ఆ స్థానంలో స్కాట్లాండ్

బుధవారం లోపు తమ నిర్ణయాన్ని వెల్లడించవలసిందిగా, లేకపోతే మరొక జట్టు టోర్నీకి అవకాశాన్ని పొందుతుందని హెచ్చరించింది. బీసీబీతో చర్చలలో పురోగతి లేకపోవడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ భారత్‌లో పర్యటించడానికి నిరాకరిస్తే, ఆ స్థానంలో స్కాట్లాండ్‌ను ఆడించాలని ఐసీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. "టీ20 వరల్డ్ కప్ 2026లో పాల్గొనే విషయంలో బుధవారం లోపు బీసీబీ నిర్ణయం తీసుకోవాలి. బంగ్లాదేశ్ భారత్‌కు వెళ్లకుంటే, ప్రస్తుత ర్యాంకింగ్స్ ఆధారంగా ఆ స్థానాన్ని మరొక జట్టుతో భర్తీ చేయడానికి సిద్ధంగా ఉండాలి" అని బీసీబీకి అల్టిమేటం జారీ చేసినట్లు ఐసీసీ వర్గాలు తెలిపాయి. ఈ రోజుతో ఆ గడువు ముగుస్తున్నందున బీసీబీ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.

Advertisement