Page Loader
KKR vs SRH: నేటి క్వాలిఫైయర్ 1లో ఎవరు గెలుస్తారు? 
KKR vs SRH: నేటి క్వాలిఫైయర్ 1లో ఎవరు గెలుస్తారు?

KKR vs SRH: నేటి క్వాలిఫైయర్ 1లో ఎవరు గెలుస్తారు? 

వ్రాసిన వారు Sirish Praharaju
May 21, 2024
10:52 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2024 ప్లేఆఫ్‌ల సమరం ప్రారంభమైంది. క్వాలిఫైయర్ 1 ఇంకాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో రెండు అతిపెద్ద బ్యాటింగ్ పవర్‌హౌస్‌లు, KKR, SRH ఒకదానితో ఒకటి తలపడతాయి. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ గ్రౌండ్ అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. రెండు జట్లలోనూ పవర్‌ హిట్టర్లున్నారు. హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఈ బాదుడు పోటీలో ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరం. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో ప్రవేశిస్తుంది. KKR జట్టు IPL క్వాలిఫయర్ 1 మ్యాచ్ ఆడటం ఇది మూడోసారి. అంతకుముందు 2012, 2014లో క్వాలిఫయర్ 1 ఆడి ఫైనల్ బెర్త్ మాత్రమే కాకుండా టైటిల్ కూడా కైవసం చేసుకున్నారు.

Details 

స్వదేశానికి కోల్‌కతా కీలక బ్యాటర్‌ 

మరోవైపు, క్వాలిఫైయర్ 1 ఆడేందుకు SRHకి ఇది రెండో అవకాశం. అంతకుముందు 2018లో ఆడిన క్వాలిఫయర్ 1లో CSK చేతిలో ఓడిపోయింది. కోల్‌కతా బ్యాటింగ్‌ లో నరైన్, శ్రేయస్, నితీష్‌ రాణా, రింకు, రసెల్‌ ఉండగా.. సన్‌రైజర్స్‌ టీంలో ట్రావిస్ హెడ్, అభిషేక్‌ శర్మ, క్లాసెన్, త్రిపాఠిలతో బ్యాటింగ్‌ దుర్భేద్యంగా కనిపిస్తోంది. కోల్‌కతా కీలక బ్యాటర్‌ ఫిల్‌ సాల్ట్‌ స్వదేశానికి వెళ్లిపోవడం మాత్రం వారికీ ప్రతికూలాంశమే. అయితే మిచెల్‌ స్టార్క్, నరైన్, వరుణ్, రసెల్‌లతో నైట్‌రైడర్స్‌ బౌలింగ్‌ కూడా బాగుంది. కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్‌ వంటి వారితో కూడిన సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ కూడా బాగుంది.

Details 

ప్లేఆఫ్స్‌లో ఈ జట్ల రికార్డు

ఇప్పటివరకు కోల్‌కతా 17 మ్యాచ్‌ల్లో నెగ్గగా.. సన్‌రైజర్స్‌ 9 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. ఈ సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నాలుగు పరుగుల స్వల్ప తేడాతో గెలిచింది. సన్‌రైజర్స్‌తో గత తొమ్మిది మ్యాచ్‌ల్లో కేకేఆర్‌ ఏడు నెగ్గడం గమనార్హం. ప్లేఆఫ్స్‌లో ఈ జట్ల రికార్డు దాదాపు ఒకే రకంగా ఉంది. కేకేఆర్‌ ప్లేఆఫ్స్‌లో ఎనిమిది నెగ్గి అయిదు ఓడిపోగా.. సన్‌రైజర్స్‌ అయిదు గెలిచి, ఆరు ఓడింది.