Bangladesh Cricket Board: బీసీబీ నిర్ణయంతో బంగ్లా క్రికెటర్లకు భారీ ఎదురుదెబ్బ.. మాజీ భారత క్రికెటర్ వ్యాఖ్యలు!
ఈ వార్తాకథనం ఏంటి
భద్రతా కారణాలను సాకుగా చూపుతూ ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 కోసం తమ జట్టును భారత్‌కు పంపబోమని 'బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు' (BCB) తేల్చిచెప్పింది. ఈ నిర్ణయంపై ఇప్పటికే క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తుండగా, ఇందులో రాజకీయాల ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోందని టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. బీసీబీ తీసుకున్న ఈ నిర్ణయంతో బంగ్లాదేశ్ క్రికెటర్లు పూర్తిగా నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయారని తివారి అభిప్రాయపడ్డాడు. క్రికెట్‌కు సంబంధం లేని కారణాల వల్ల ప్రపంచకప్ వంటి మెగా టోర్నీకి దూరమవ్వాల్సి రావడం ఆ దేశ ఆటగాళ్లకు తీవ్ర మనోవేదన కలిగిస్తోందని అన్నాడు.
Details
బంగ్లా క్రికెటర్లకు పెద్ద ఎదురుదెబ్బ
ఈ విషయంపై ఓ వార్తా సంస్థతో మనోజ్ తివారి మాట్లాడారు. ఇది నిజంగా బంగ్లా క్రికెటర్లకు పెద్ద ఎదురుదెబ్బ. ఏ ఆటగాడైనా తన దేశం తరఫున వరల్డ్‌కప్‌లో ఆడాలని కోరుకుంటాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దేశ ఆటగాళ్ల చేతుల్లో ఏమీ లేదు. ఈ విషయంలో ఐసీసీ కూడా చాలా స్పష్టంగా ఉంది. వేదికలు మార్చే ప్రశ్నే లేదు. ఆడతారా? లేదా తప్పుకుంటారా? అనే నిర్ణయాన్ని పూర్తిగా బీసీబీకే వదిలేసిందని వెల్లడించాడు. అదేవిధంగా ఐసీసీ అత్యంత శక్తివంతమైన సంస్థ. అలాంటిది బీసీబీ ఈ తరహా నిర్ణయం ఎందుకు తీసుకుందో ఎవరికీ అర్థం కావడం లేదు. బయట నుంచి చూస్తున్న వారికీ ఇందులో బోర్డు స్వేచ్ఛ చాలా పరిమితంగానే ఉందని తెలుస్తోంది.
Details
ఐసీసీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు
క్రీడల్లో రాజకీయాలు జోక్యం చేసుకుంటే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయి. నేను ఎప్పుడూ ఇదే చెబుతుంటాను. కేవలం రాజకీయ కారణాల వల్లే బంగ్లాదేశ్ ప్రపంచకప్‌కు దూరమవుతోంది. క్రికెట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఇక బంగ్లాదేశ్ అధికారికంగా టోర్నీ నుంచి తప్పుకుంటే, వారి స్థానంలో స్కాట్లాండ్ జట్టును ప్రపంచకప్‌లోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఐసీసీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. త్వరలోనే ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశముందని సమాచారం. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్ 2026 భారత్, శ్రీలంక సంయుక్త వేదికగా జరగనున్న విషయం తెలిసిందే.