భారత క్రికెట్ టీమ్ లీడ్ స్పాన్సర్‌గా 'డ్రీమ్ 11': బీసీసీఐ ప్రకటన
భారత క్రికెట్ జట్టు లీడ్ స్పాన్సర్ గా 'డ్రీమ్ 11'ని బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది. డ్రీమ్ 11 కంటే ముందు లీడ్ స్పాన్సర్ గా బైజూస్ ఉండేది. బైజూస్ కాంట్రాక్ట్ మార్చ్ 2023లో ముగిసిపోవడంతో, ప్రస్తుతం లీడ్ స్పాన్సర్ గా డ్రీమ్ లెవెన్ కొనసాగనుంది. ఈ కాంట్రాక్టు మూడు సంవత్సరాల పాటు ఉండనుంది. అంటే 2026వరకు లీడ్ స్పాన్సర్‌గా డ్రీమ్ 11 ఉండనుంది.
వెస్టిండీస్ టూర్ నుండి టీమ్ ఇండియా జెర్సీలో డ్రీమ్ 11
2019లో టీమ్ ఇండియా స్పాన్సర్‌గా ఉన్న ఒప్పో స్థానంలో బైజూస్ వచ్చి చేరింది. మూడు సంవత్సరాల కాంట్రాక్ట్ 2022లో ముగిసినప్పటికీ మళ్ళీ 2023 మార్చి వరకు బైజూస్ కాంట్రాక్టును పెంచారు. వెస్టిండీస్ పర్యటనలో డొమినికా రోసోలోని విండర్స్ పార్క్‌లో జులై 12వ తేదీన జరగనున్న మొదటి టెస్టు నుండి టీమిండియా జెర్సీలో డ్రీమ్ 11 బ్రాండ్ పేరు ఉండనుంది. ఈ టెస్ట్ సిరీస్ అనేది 2023-25 మధ్య కాలంలోని జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో భాగంగా భారత జట్టు ఆడుతున్న మొదటి అసైన్‌మెంట్ అన్నమాట.