LOADING...
Vaibhav Sooryavanshi: వైభవ్ టాలెంట్‌కు ప్రపంచం ఫిదా.. ఇంగ్లాండ్ టూర్‌కు పంపాలని వాన్ సూచన
వైభవ్ టాలెంట్‌కు ప్రపంచం ఫిదా.. ఇంగ్లాండ్ టూర్‌కు పంపాలని వాన్ సూచన

Vaibhav Sooryavanshi: వైభవ్ టాలెంట్‌కు ప్రపంచం ఫిదా.. ఇంగ్లాండ్ టూర్‌కు పంపాలని వాన్ సూచన

వ్రాసిన వారు Moogati Shabari
Mar 31, 2026
12:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

చిన్న వయసులోనే విశేష ప్రతిభ చూపిస్తున్న వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లో ప్రవేశించి, తొలి సీజన్‌లోనే శతకం బాదుతూ అరుదైన రికార్డు సాధించాడు. అనంతరం 15వ ఏట అడుగుపెట్టిన వెంటనే వేగవంతమైన అర్ధశతకం నమోదు చేసి, ఆ ఘనతను అందుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఇటీవలి కాలంలో అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ కూడా అతను దూకుడైన ఆటతో ఆకట్టుకున్నాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లోకి రావడానికి ఉన్న వయోపరిమితి సమస్య తొలగిపోవడంతో, అతడిని వెంటనే భారత జట్టులోకి తీసుకోవాలనే అభిప్రాయాలు బలపడుతున్నాయి.

వివరాలు 

బీసీసీఐకి కీలక సూచన

ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ బీసీసీఐకి ఒక ముఖ్యమైన సలహా ఇచ్చాడు. త్వరలో జరగనున్న ఇంగ్లాండ్ పర్యటనకు వైభవ్ సూర్యవంశీని పంపాలని ఆయన సూచించాడు. మైకెల్ వాన్ మాట్లాడుతూ..వైభవ్ భారత జట్టులో ఎప్పుడు ప్రవేశిస్తాడో చూడాలని తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌లోనే అతని ప్రతిభను చూశామన్నారు. రాబోయే కొన్ని నెలల్లో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. తాను భారత క్రికెట్‌లో భాగమైతే, ఖచ్చితంగా వైభవ్‌కు అవకాశం కల్పించేవాడినని అన్నారు. కనీసం జట్టులో చేర్చితే, డ్రెస్సింగ్ రూమ్ అనుభవం అయినా అతనికి లభిస్తుందని పేర్కొన్నారు.

వివరాలు 

ఆ విమర్శలు పట్టించుకోవద్దని సలహా

ఇక రాజస్థాన్ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. వైభవ్ సూర్యవంశీకి లీగ్ దశలోని మొత్తం 14 మ్యాచ్‌లలో అవకాశమిస్తామని ముందే చెప్పామన్నారు. అలాగే బయట జరుగుతున్న చర్చలను అస్సలు పట్టించుకోవద్దని సూచించామన్నారు. తాను, ధ్రువ్ జురెల్ కలిసి డగౌట్‌లో కూర్చుని వైభవ్ ఆటను ఆస్వాదించడం చాలా ఇష్టమని అన్నారు. పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉందని అనిపించినా, అతను ప్రతి బంతిని స్టాండ్స్‌లోకి పంపేందుకు ప్రయత్నించడం ఆశ్చర్యంగా ఉంటుందన్నారు. అతని ఆట తీరు నిజంగా అద్భుతమని, అలాంటి ఆటగాడు తమ జట్టులో ఉండటం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.

Advertisement