2023 జనవరిలో బీసీసీఐ నూతన సెలక్షన్ కమిటీ..!
2023 జనవరిలో అశోక్ మల్హోత్రా నేతృత్వంలో క్రికెట్ అడ్వైజరీ కమిటీ, కొత్త సెలక్షన్ కమిటీని ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ముంబైలోని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా కార్యాలయంలో సమావేశం డిసెంబర్ 30న జరగనుంది. ఇందులో సభ్యులగా సులక్షణ నాయక్, పరంజ్పే ఉండనున్నారు. ఈ సమావేశానికి ఎటువంటి ఎజెండాను ఎంపిక చేయకపోవడం గమనార్హం. సీనియర్ పురుషుల జట్టు జాతీయ సెలక్టర్ల నియామకం కోసం బోర్డు దరఖాస్తులను ఆహ్వానించింది. నవంబర్ 28వ తేదీ వరకు దరఖాస్తులను అందించారు. సాధారణంగా సీనియర్ సెలక్షన్ కమిటీ నాలుగేళ్లపాటు బాధ్యతలు నిర్వహించేలా బీసీసీఐ అవకాశం కల్పిస్తుంది. అయితే BCCIకి బోగస్ మెయిల్స్‌తో సహా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. అన్ని దరఖాస్తులు ఇప్పటికే CAC సభ్యులకు పంపించారు.
సెలక్షన్ కమిటీ ఏర్పాటుకు మరికొంత సమయం
శ్రీలంక సిరీస్ కోసం ఇప్పటికే జట్టును ప్రకటించారు. ఇంకా సెలక్షన్ కమిటీ అవసరం ప్రస్తుతానికి లేదు. సెలక్షన్ కమిటీ ఏర్పాటుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి, షార్ట్‌లిస్ట్ చేసిన పేర్లను వర్చువల్‌గా పిలవకుండా వ్యక్తిగత ఇంటర్వ్యూలు తీసుకోవడానికి అధికారులు ఆసక్తి చూపుతున్నారు. వెంకటేష్ ప్రసాద్, ఎస్ఎస్ దాస్, మణిందర్ సింగ్, ఎస్ శరత్, నయన్ మోంగియా, ముకుంద్ పర్మార్, సలీల్ అంకోలా, సమీర్ దిఘే దరఖాస్తు చేసుకున్నారు. కొత్త సెలక్షన్ కమిటీ చైర్మన్ ఒక్కో ఫార్మాట్లో కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సి ఉంటుంది.ఆ దిశగా బీసీసీఐ అడుగులేస్తోందని భావిస్తున్నారు.