BCCI: బీసీసీఐకి కొత్త కార్యదర్శి, కోశాధికారి.. జనవరి 12న ఎన్నికలు
బీసీసీఐ (BCCI)కి త్వరలో కొత్త కార్యదర్శి రానున్నారు. బీసీసీఐ సర్వసభ్య సమావేశం వచ్చే ఏడాది జనవరి 12న ముంబయిలో జరగనుంది. అదే రోజున కార్యదర్శి, కోశాధికారి పదవుల భర్తీ కోసం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అచల్‌కుమార్ జ్యోతిని ఎన్నికల అధికారిగా నియమించారు. ఈ నిర్ణయాన్ని అపెక్స్ కౌన్సిల్ తీసుకున్నది. రాష్ట్ర క్రికెట్ సంఘాలకు దీనిపై సమాచారం పంపించబడింది. ప్రస్తుతం ఐసీసీ ఛైర్మన్‌గా జై షా (Jay Shah) మహారాష్ట్ర మంత్రిగా ఆశిష్ షెలార్ బాధ్యతలు స్వీకరించడంతో బోర్డు కార్యదర్శి, కోశాధికారి పదవులు ఖాళీ అయ్యాయి.
రాజీనామా చేసిన సభ్యుల స్థానాలను 45 రోజులలో భర్తీ చేయాలి
బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం, రాజీనామా చేసిన కార్యవర్గ సభ్యుల స్థానాలను 45 రోజుల్లోపు భర్తీ చేయాలి. ఈ ప్రకారం, ఎన్నికలకు నాలుగు వారాల ముందే ఎన్నికల అధికారిని నియమించాలి. అందువల్ల, ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాట్లు మొదలయ్యాయి. అయితే, కార్యదర్శి, కోశాధికారి ఎన్నికలు ఏకగ్రీవంగా జరగవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం, అస్సాంలోని దేవ్‌జిత్ సైకియా తాత్కాలిక కార్యదర్శిగా కొనసాగుతున్నారు. గుజరాత్ క్రికెట్ సంఘం కార్యదర్శి అనిల్ పటేల్‌తోపాటు, దేవ్‌జిత్ సైకియా కూడా కార్యదర్శి పదవికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.