Bhuvneshwar Kumar: ఇవి కొత్త పిచ్‌లు కావు.. దశాబ్దాలుగా ఇదే జరుగుతోంది: భువనేశ్వర్ కుమార్
ఈ వార్తాకథనం ఏంటి
కోల్‌కతా పిచ్‌పై వివాదాలు రేగుతున్న నేపథ్యంలో, టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో స్పిన్ పిచ్‌లు ఇప్పుడే కొత్తగా తయారుచేయడం లేదని,కొన్ని దశాబ్దాలుగా ఇదే కొనసాగుతోందని అన్నాడు. అప్పుడు ఎవరూ ప్రశ్నించని విషయాన్ని ఇప్పుడు ఎందుకు పెద్దది చేస్తున్నారని పేర్కొన్నాడు. "భారత్‌లో స్పిన్ పిచ్‌లు సిద్ధం చేయడం ఇదేం కొత్త విషయం కాదు. టీమ్ ఇండియా విజయం సాధిస్తున్నప్పుడు ఈ విషయం ఎవరూ ప్రస్తావించలేదు. గెలుపు-ఓటములు ఆటలో సహజం. ఇంతకుముందు భారత జట్టు ఎప్పుడూ ఓడలేదా? ఇదే తొలి ఓటమా?నా దృష్టిలో ఈ పరాజయం గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు"అని భువనేశ్వర్ స్పష్టం చేశాడు. నలుగురు స్పిన్నర్లను బరిలోకి దింపిన నిర్ణయంపై కూడా అతడు స్పందించాడు.
వివరాలు
శుభమన్ గిల్ కెప్టెన్సీపై భువనేశ్వర్
"పిచ్ స్పిన్ బౌలింగ్‌కు మద్దతుగా ఉన్నప్పుడు నలుగురు స్పిన్నర్లను (అక్షర్ పటేల్, జడేజా, కుల్‌దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్)ఆడించడంలో తప్పు లేదు. అది స్పష్టంగా టర్నింగ్ ట్రాక్. మ్యాచ్ ఎలా సాగిందో చూస్తే,నలుగురు స్పిన్నర్లతో ఆడినా తప్పేమీ లేదు" అని భువీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అదే విధంగా శుభమన్ గిల్ కెప్టెన్సీపై కూడా భువనేశ్వర్ వ్యాఖ్యానించాడు. "గిల్ కొత్తగానే నాయకత్వం చేపట్టాడు. మానసికంగా,శారీరకంగా అతడికి కొంత విరామం కావాలి. త్వరలో ఐపీఎల్ సీజన్ మొదలవుతుంది.ఈ టోర్నమెంట్ వల్ల గత పదేళ్లలో భారత బౌలింగ్ శక్తి భారీగా పెరిగింది. ఐపీఎల్‌లో ఆడిన అనుభవం బౌలర్లకు ఎంతో ఉపయోగపడుతోంది.అలాగే ఈలీగ్ వల్ల భారత జట్టుకు కొత్త ప్రతిభలు నిరంతరం లభిస్తున్నాయి" అని భువనేశ్వర్ విశ్లేషించాడు.