Loading...
Jos Buttler: ఇంగ్లండ్‌కు బిగ్‌ షాక్‌.. ట్రై సిరీస్‌కు స్టార్‌ బ్యాటర్‌ దూరం
ఇంగ్లండ్‌కు బిగ్‌ షాక్‌.. ట్రై సిరీస్‌కు స్టార్‌ బ్యాటర్‌ దూరం

Jos Buttler: ఇంగ్లండ్‌కు బిగ్‌ షాక్‌.. ట్రై సిరీస్‌కు స్టార్‌ బ్యాటర్‌ దూరం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 29, 2026
09:25 am

ఈ వార్తాకథనం ఏంటి

వచ్చే నెల పాకిస్థాన్‌ వేదికగా జరగనున్న వన్డే ట్రై సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇన్‌ఫామ్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ హ్యామ్‌స్ట్రింగ్‌ గాయం కారణంగా ఈ టోర్నీకి దూరమయ్యాడు. అతడి స్థానంలో జోర్డాన్‌ కాక్స్‌ను జట్టులోకి ఎంపిక చేశారు. శ్రీలంకతో తాజాగా జరిగిన రెండో వన్డేలో బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో బట్లర్‌ హ్యామ్‌స్ట్రింగ్‌ గాయానికి గురయ్యాడు. బట్లర్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన జోర్డాన్‌ కాక్స్‌ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో మూడు అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలోనూ బట్లర్‌ స్థానంలో బరిలోకి దిగిన కాక్స్‌ 76 పరుగులు చేశాడు.

వివరాలు

అక్టోబర్ 20 నుంచి ప్రారంభం

కాగా, పాకిస్థాన్‌, శ్రీలంక, ఇంగ్లండ్‌ మధ్య ముక్కోణపు వన్డే టోర్నీ అక్టోబర్‌ 20 నుంచి ప్రారంభం కానుంది.

ఈ టోర్నీ అనంతరం నవంబర్‌లో ఇంగ్లండ్‌.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అయితే బట్లర్‌ గాయం కారణంగా ఆస్ట్రేలియా పర్యటనకు కూడా అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. స్వదేశంలో శ్రీలంకతో తాజాగా ముగిసిన పరిమిత ఓవర్ల సిరీస్‌ల్లో ఇంగ్లండ్‌ అద్భుత విజయాలు సాధించింది.

ముందుగా జరిగిన టీ20 సిరీస్‌ను ఆతిథ్య జట్టు 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. అనంతరం జరిగిన వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది.

వివరాలు

ఇంగ్లండ్ కు గట్టి ఎదురుదెబ్బ

ఈ రెండు సిరీస్‌ల్లోనూ జోస్‌ బట్లర్‌ కీలక పాత్ర పోషించాడు. టీ20 సిరీస్‌లో రెండు అర్ధ సెంచరీలు సాధించిన అతడు.. వన్డేల్లోనూ ఓ అర్ధ సెంచరీతో రాణించాడు.

ఇలాంటి సమయంలో బట్లర్‌ గాయంతో ట్రై సిరీస్‌కు దూరం కావడం ఇంగ్లండ్‌కు గట్టి లోటుగా మారింది.

ADVERTISEMENT