Women World Cup: 2029 మహిళల క్రికెట్ ప్రపంచకప్‌లో బిగ్ చేంజ్.. కీలక నిర్ణయం తీసుకున్న ఐసీసీ!
ఈ వార్తాకథనం ఏంటి
భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శనతో 2025 ఐసీసీ మహిళా క్రికెట్ ప్రపంచకప్ విజేతగా నిలిచింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి తొలి టైటిల్‌ను దక్కించుకుంది. ఈ చారిత్రక విజయానికి వారం రోజులు కూడా గడవకముందే, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం జరిగిన బోర్డు సమావేశంలో మహిళల ప్రపంచకప్‌లో జట్ల సంఖ్యను పెంచే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. భారత్, శ్రీలంకల సంయుక్త ఆతిథ్యంతో నిర్వహించిన 2025 ప్రపంచకప్ విజయం, ప్రేక్షకాదరణ ఈ నిర్ణయానికి ప్రేరణగా నిలిచాయని ICC పేర్కొంది.
Details
ఇకపై 10 జట్లు ఆడనున్న మహిళల ప్రపంచకప్
ICC అధికారిక ప్రకటనలో మహిళల క్రికెట్ టోర్నమెంట్లలో పెరుగుతున్న ప్రజాదరణను దృష్టిలో ఉంచుకుని, ప్రపంచకప్‌ను 8 జట్ల నుంచి 10 జట్లకు విస్తరించాలని బోర్డు నిర్ణయించింది. ఈ ఈవెంట్ విజయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యమని తెలిపింది. 2025 ప్రపంచకప్‌ను ప్రత్యక్షంగా దాదాపు 3 లక్షల మంది ప్రేక్షకులు స్టేడియాల్లో వీక్షించారని, ఇది ఇప్పటివరకు జరిగిన ఏ మహిళల క్రికెట్ టోర్నమెంట్‌కైనా రికార్డని ICC వివరించింది. టెలివిజన్, డిజిటల్ ప్లాట్‌ఫార్ముల ద్వారా కూడా ఈ టోర్నమెంట్ అత్యధిక వీక్షకులను సాధించింది.
Details
వీక్షణలో కొత్త రికార్డులు
భారత్, శ్రీలంక ఆతిథ్యమిచ్చిన ఈ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ జట్టు తన అన్ని మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడగా, లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఫలితంగా రెండు సెమీ ఫైనల్స్, ఫైనల్ భారత్‌లోనే జరిగాయి. భారత్-దక్షిణాఫ్రికా ఫైనల్‌ను జియో హాట్‌స్టార్‌లో 18.5 కోట్ల మంది వీక్షించారు, ఇది పురుషుల టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌తో సమానమని నివేదికలు చెబుతున్నాయి. మొత్తం టోర్నమెంట్‌ను 44.6 కోట్ల మంది వీక్షించగా, టైటిల్ మ్యాచ్‌ను ఒకేసారి 2.1 కోట్ల మంది వీక్షించారు. ఇది మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యధి
Details
తదుపరి ఎడిషన్ 2029లో
తదుపరి మహిళల వన్డే ప్రపంచకప్ 2029లో జరగనుంది. హోస్ట్ దేశాన్ని ఇంకా ప్రకటించలేదు. అయితే జట్ల సంఖ్య పెరగడంతో టోర్నమెంట్ ఫార్మాట్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకోవచ్చు. 2025 ఎడిషన్‌లో రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో ప్రతి జట్టు మిగతా 7 జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడింది. పాయింట్ల పట్టికలో అగ్ర నాలుగు జట్లు సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధించగా, భారత్ ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ చేరి, దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. భారత మహిళల ఈ విజయం మహిళా క్రికెట్ చరిత్రలోనే కాదు, భారత క్రీడా చరిత్రలో కూడా ఒక మైలురాయిగా నిలిచింది.