Sri lanka: ప్రపంచకప్‌లో సంచలన ఫలితం.. న్యూజిలాండ్‌పై శ్రీలంక చారిత్రక విజయం
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో అనూహ్య ఫలితం నమోదైంది. మంగళవారం జరిగిన గ్రూప్-బి పోరులో శ్రీలంక జట్టు అద్భుత ప్రదర్శనతో డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది. ఈ పరాజయంతో కివీస్ జట్టు టోర్నీలో వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. అంతేకాకుండా, మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో న్యూజిలాండ్‌పై శ్రీలంకకు ఇది తొలి విజయం కావడం విశేషంగా నిలిచింది.
వివరాలు
ఇన్నింగ్స్ సాగిందిలా..
సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఆ జట్టులో సోఫీ డివైన్, అమేలియా కెర్ తలో 45 పరుగులు చేసి జట్టుకు బలమైన స్కోరు అందించారు. శ్రీలంక బౌలర్లలో కవిషా దిల్హారీ రెండు వికెట్లు తీసి ఆకట్టుకుంది. 151 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు ధైర్యంగా పోరాడి 19.4 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 153 పరుగులు సాధించింది. క్లిష్ట పరిస్థితుల్లో నిలక్షి డి సిల్వా 37 బంతుల్లో అజేయంగా 54 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చింది.
వివరాలు
సజీవంగా సెమీ ఫైనల్ ఆశలు..
ఆమెకు కౌషిని నుత్యంగన చక్కటి సహకారం అందించగా, ఇద్దరూ కలిసి ఆరో వికెట్‌కు కేవలం 28 బంతుల్లోనే అజేయంగా 48 పరుగులు జోడించి మ్యాచ్‌ను శ్రీలంక వైపు తిప్పారు. టోర్నీలో తమ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడిన శ్రీలంక, ఈ విజయంతో ఖాతా తెరిచి సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మరోవైపు, ఇప్పటికే వెస్టిండీస్ చేతిలో ఓటమి పాలైన న్యూజిలాండ్, ఇప్పుడు శ్రీలంక చేతిలో కూడా పరాజయం చెందడంతో టైటిల్‌ను నిలబెట్టుకునే ప్రయాణం మరింత కఠినంగా మారింది.