Akshara Gupta : వైభవ్ తర్వాత బీహార్ నుంచి మరో క్రికెట్ సంచలనం.. 126 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ
ఈ వార్తాకథనం ఏంటి
బీహార్‌కు చెందిన యువ క్రికెటర్లు వరుసగా తమ ప్రతిభతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు. ఇప్పటికే వైభవ్ సూర్యవంశీ తన అద్భుత బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకోగా, ఇప్పుడు అదే రాష్ట్రానికి చెందిన యువ మహిళా క్రికెటర్ అక్షర గుప్తా తన అసాధారణ ఇన్నింగ్స్‌తో అందరి దృష్టిని తనవైపు మళ్లించింది. బీహార్ అండర్-19 వన్డే టోర్నమెంట్‌లో జరిగిన మ్యాచ్‌లో అక్షర గుప్తా చెలరేగిపోయింది. ప్రత్యర్థి బౌలర్లను పూర్తిగా ఆధిపత్యంలోకి తీసుకుంటూ కేవలం 126 బంతుల్లోనే అజేయంగా 306 పరుగులు సాధించింది. ఆమె ఇన్నింగ్స్‌లో ఏకంగా 55 ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు ఉండటం విశేషం. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన అక్షర, 16 బంతుల్లో అర్ధశతకం, 34 బంతుల్లోనే శతకం చేసి తన దూకుడును చాటిచెప్పింది.
వివరాలు
తొలి మహిళా క్రికెటర్‌గా కూడా చరిత్ర..
15 ఏళ్ల అక్షర గుప్తా బీహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లా రక్సౌల్ పట్టణానికి చెందినది. ఆమె తండ్రి రాజకిషోర్ షా అక్కడ చికెన్ షాపు నిర్వహిస్తుండగా, తల్లి రీనా గుప్తా గృహిణిగా ఉన్నారు. అక్షర క్రికెట్ ప్రయాణంలో ఆమె మామయ్య రామ్‌కృపా గుప్తా కీలక పాత్ర పోషిస్తూ ప్రతి మ్యాచ్‌కు వెంట ఉంటారు. చిన్న పట్టణం నుంచి వచ్చిన అక్షర తన కృషి, పట్టుదలతో మహిళల క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. కేవలం 14 ఏళ్ల వయస్సులోనే బీహార్ అండర్-19 మహిళల జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టింది. అలాగే బీహార్ తరఫున వరుసగా రెండేళ్లలో నాలుగు బీసీసీఐ మహిళల టోర్నమెంట్లు ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా కూడా చరిత్ర సృష్టించింది.
వివరాలు
భవిష్యత్ క్రికెటర్లకు స్ఫూర్తి..
ఇప్పటికే వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను నిరూపించగా, ఇప్పుడు అక్షర గుప్తా కూడా తన అద్భుత ప్రదర్శనతో బీహార్‌లోని యువ క్రికెట్ ప్రతిభ మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యేలా చేసింది. అక్షర గుప్తా ప్రదర్శనపై బీహార్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు హర్షవర్ధన్ అభినందనలు తెలిపారు. రాష్ట్ర మహిళా క్రికెటర్లు తమ అద్భుత ఆటతీరుతో బీహార్‌కు నిరంతరం కీర్తి తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. యువ క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు బీసీఏ నిరంతరం కృషి చేస్తోందని, అక్షరలాంటి ఇన్నింగ్స్‌లు భవిష్యత్ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలుస్తాయని ఆయన వెల్లడించారు.