Bomb Threat: అండర్-19 మ్యాచ్ జరుగుతుండగా నరేంద్ర మోదీ స్టేడియానికి బాంబు బెదిరింపు
ఈ వార్తాకథనం ఏంటి
అహ్మదాబాద్‌లోని ప్రపంచ ప్రఖ్యాత నరేంద్ర మోదీ స్టేడియానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. బుధవారం ఉదయం ఈ-మెయిల్ ద్వారా ఈ హెచ్చరిక అందింది. ఆ సమయంలో స్టేడియంలో భారత్ అండర్-19,ఆస్ట్రేలియా అండర్-19 జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. అయితే పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఎలాంటి ప్రమాదకర వస్తువులు కనిపించకపోవడంతో, ఆ బెదిరింపు వదంతేనని అధికారులు నిర్ధారించారు. నవంబర్ 21న నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ప్రముఖ గాయకుడు దిల్జిత్ దోసాంజ్ సంగీత కచేరీని లక్ష్యంగా చేసుకుని ఈ బెదిరింపు పంపినట్లు ఈ-మెయిల్‌లో పేర్కొన్నారు. తాము ఖలిస్థాన్ అనుకూల సంస్థకు చెందిన వారమని అందులో పేర్కొంటూ.. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లను ప్రస్తావించారు. దిల్జిత్ దోసాంజ్ నిర్వహించే కచేరీలకు ఎవరూ హాజరుకావద్దని హెచ్చరించారు.
వివరాలు
గుజరాత్ క్రికెట్ అసోసియేషన్‌కు ఈ-మెయిల్
ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో నవంబర్ 1న జరగనున్న ఆయన కార్యక్రమాన్ని కూడా బెదిరింపు ఈ-మెయిల్‌లో ప్రస్తావించారు.
బుధవారం ఉదయం 10:52 గంటలకు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్‌కు ఈ-మెయిల్ అందింది.
వెంటనే అసోసియేషన్ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలియడంతో భద్రతా చర్యలు చేపట్టారు.
ఉదయం 11:15 గంటలకు మ్యాచ్ ముగిసిన తర్వాత భారత్, ఆస్ట్రేలియా అండర్-19 జట్ల ఆటగాళ్లు స్టేడియం నుంచి బయటకు వెళ్లిపోయారు.
అనంతరం సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి బెదిరింపు ఈ-మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై దర్యాప్తు ప్రారంభించారు.
వివరాలు
అహ్మదాబాద్‌లో మొత్తం 13 ప్రాంతాలకు బాంబు బెదిరింపులు
ఈ ఘటనపై ఏసీపీ (సైబర్ క్రైమ్) హార్దిక్ మకాడియా మాట్లాడుతూ.. బుధవారం అహ్మదాబాద్‌లో మొత్తం 13 ప్రాంతాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు తెలిపారు.
నరేంద్ర మోదీ స్టేడియంతో పాటు పలు పాఠశాలలు, ఇతర సంస్థలకు కూడా ఇలాంటి హెచ్చరికలు అందాయని చెప్పారు.
అయితే తనిఖీల అనంతరం అవన్నీ అవాస్తవ బెదిరింపులేనని తేలిందన్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.
బెదిరింపులు వచ్చిన అన్ని ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్‌లు, డాగ్ స్క్వాడ్‌ల సహాయంతో ఆయా ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేదా పేలుడు పదార్థాలు గుర్తించలేదని అధికారులు స్పష్టం చేశారు.