Border-Gavaskar Trophy: బాక్సింగ్ డే టెస్టు.. భారత్ రికార్డులు ఎలా ఉన్నాయో చూద్దాం..
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (Border Gavaskar Trophy)లో బాక్సింగ్ డే టెస్టుకు టీమిండియా సన్నద్ధమవుతోంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా ఉన్న ఈ పోటీలో డిసెంబర్ 26 నుండి ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్టులో టీమ్ ఇండియాకు విజయం ఎంతో అవసరం. గత రెండు బాక్సింగ్ డే టెస్టుల్లో విజయాలు సాధించిన భారత జట్టు, ఇప్పుడు మరోసారి సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టులో ఇప్పటివరకు భారత్ చేసిన రికార్డుల గురించి చూద్దాం.
కోహ్లీ నాయకత్వంలో బాక్సింగ్ డే టెస్టులో తొలిసారిగా విజయం
భారతదేశం ఆస్ట్రేలియాతో ఇప్పటివరకు 9 బాక్సింగ్ డే టెస్టుల్లో ఆడింది. ఈ మ్యాచ్‌లలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. అందులో రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే టీమ్ ఇండియా గెలుపొందగా,ఐదు మ్యాచ్‌ల్లో ఆసీస్ విజయం సాధించింది.మరో రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. 1985లో మొదటిసారిగా భారత్-ఆస్ట్రేలియా టెస్టు జరగగా,ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆ తరువాత ఐదు టెస్టుల్లో ఆసీస్ గెలుపొందింది. 2014లో జరిగిన మ్యాచ్ కూడా డ్రాగా ముగిసింది. 2018లో, విరాట్ కోహ్లీ నాయకత్వంలో భారత జట్టు బాక్సింగ్ డే టెస్టులో తొలిసారిగా విజయం సాధించింది. 2020లో అజింక్యా రహానె నాయకత్వంలో భారత్ మరోసారి ఘన విజయం సాధించింది, 8 వికెట్ల తేడాతో ఆసీస్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో రహానె అద్భుతమైన శతకం(112) సాధించాడు.
రెండు బాక్సింగ్ డే టెస్టుల్లో భారత జట్టు విజయం
మెల్‌బోర్న్‌లో భారత్ మొత్తం 14 టెస్టులు ఆడింది, అందులో నాలుగు విజయాలు సాధించగా, రెండు డ్రాలు, ఎనిమిది అపజయాలు నమోదు అయ్యాయి. మెల్‌బోర్న్‌లో జరిగిన గత రెండు బాక్సింగ్ డే టెస్టుల్లో భారత జట్టు విజయం సాధించింది. ప్రస్తుత బోర్డర్ గావస్కర్ ట్రోఫీ కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో, అభిమానులు భారత్ మరోసారి సత్తా చాటాలని కోరుకుంటున్నారు. మొత్తం 18 బాక్సింగ్ డే టెస్టులు ఆడిన భారత్ 4 విజయాలు, 3 డ్రాలు సాధించింది.
మెల్‌బోర్న్‌లో విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన
మెల్‌బోర్న్‌లో విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశాడు. మెల్‌బోర్న్ మైదానంలో ఆడిన మూడు టెస్టుల్లో 52.66 సగటుతో 316 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ,రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి. 2014లో ఇక్కడ సాధించిన 169 ఇన్నింగ్స్‌తో కోహ్లీ పేరు మార్మోగిపోయింది. ఇదే మైదానంలో కోహ్లీ 2021లో పాకిస్థాన్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో 53 బంతుల్లో 82 పరుగులు చేసి జట్టును గెలిపించాడు, ఇది అభిమానుల మదిలో చిరస్థాయిగా నిలిచింది. అయితే ప్రస్తుత ఫామ్ విషయంలో కోహ్లీపై ఆందోళనలు ఉన్నా, అతడు తన ఫామ్‌ను తిరిగి ప్రదర్శిస్తే, టీమ్ ఇండియాకు తిరుగుండదు.
బాక్సింగ్ డే పేరు ఎలా వచ్చిందంటే..
2018లో మెల్‌బోర్న్‌లో జరిగిన టెస్టులో జస్ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. 6/33తో మైలురాయిని సాధించిన ఈ పేసర్, ప్రస్తుత టోర్నీలో కూడా తన గట్టి ప్రదర్శనను కొనసాగిస్తాడని అంచనా. బాక్సింగ్ డే అనే పేరు 'క్రిస్మస్ బాక్స్' నుంచి వచ్చింది. క్రిస్మస్ తర్వాత, డిసెంబర్ 26న 'క్రిస్మస్ బాక్స్' పేరుతో యజమానులు తమ సేవకులకు బహుమతులు అందించే రోజు అని ఆ రోజు బాక్సింగ్ డే అని పిలవడం మొదలైంది. ఈ తీరును అనుసరిస్తూ, ఆస్ట్రేలియాలో మెల్‌బోర్న్‌లో బాక్సింగ్ డే (డిసెంబర్ 26) రోజున ప్రారంభమయ్యే మ్యాచ్ 'బాక్సింగ్ డే టెస్టు'గా మారింది.