Page Loader
Jasprit Bumrah: టెస్ట్ కెప్టెన్సీకి నో చెప్పిన బుమ్రా.. కారణాలను వెల్లడించిన పేసర్
టెస్ట్ కెప్టెన్సీకి నో చెప్పిన బుమ్రా.. కారణాలను వెల్లడించిన పేసర్

Jasprit Bumrah: టెస్ట్ కెప్టెన్సీకి నో చెప్పిన బుమ్రా.. కారణాలను వెల్లడించిన పేసర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 18, 2025
10:49 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు భారత జట్టు నుంచి కీలక నిర్ణయం వెలువడింది. జూన్ 20 నుంచి ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌ భారత జట్టును నాయకత్వం వహించనున్నాడు. ఈ సిరీస్‌లో జట్టు పగ్గాలు గిల్‌కు అప్పగించడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. ఎందుకంటే జస్పిత్ బుమ్రాకే టెస్టు కెప్టెన్సీ ఇస్తారని అందరూ భావించారు. కానీ బీసీసీఐ అనూహ్యంగా గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఈ పరిణామాలపై స్వయంగా జస్ప్రీత్ బుమ్రా స్పందించాడు. ఇటీవలే మాజీ క్రికెటర్, కామెంటేటర్ దినేశ్ కార్తీక్ నిర్వహించిన ఓ టీవీ షోలో బుమ్రా మాట్లాడారు.

Details

జట్టకే ప్రాధాన్యం

కెప్టెన్సీ బాధ్యతలు ఎందుకు స్వీకరించలేదో వివరించాడు. 'ఇంగ్లండ్‌తో సిరీస్ సందర్భంగా నా పనిభార నిర్వహణపై బీసీసీఐతో చర్చించాను. బౌలింగ్‌పై పూర్తి దృష్టి పెట్టాలనుకున్నాను. నా ఫిట్‌నెస్, ముఖ్యంగా వెన్నుతో సంబంధమైన విషయాలను సర్జన్, ఫిజియోతో చర్చించాను. వాళ్ల సూచనల మేరకు టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోకూడదని నిర్ణయించుకున్నాను. ఈ విషయాన్ని బీసీసీఐకి ముందే తెలియజేశానని బుమ్రా స్పష్టం చేశాడు. కెప్టెన్సీ బాధ్యతలు తీసుకుంటే ఐదు మ్యాచ్‌ల సిరీస్ మొత్తాన్ని ఆడతానా లేదా అనేది అనిశ్చితంగా ఉంటుంది. ఒక సిరీస్‌కి ఇద్దరు కెప్టెన్లు ఉండటం జట్టుకు మంచిదికాదు.

Details

ఫిట్‌నెస్‌ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోను

జట్టే నాకు ప్రధానం, నాయకత్వం కాదు. కెప్టెన్సీ అంటే తక్కువ కాదు, అది గొప్ప గౌరవం. కానీ నేను ఫిట్‌నెస్‌ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోలేను. అందుకే బీసీసీఐని ముందుగానే ఆ విషయంపై స్పష్టంగా అలర్ట్ చేశానని బుమ్రా వివరించాడు. ఈ వ్యాఖ్యలతో బుమ్రా తన ప్రాధాన్యతలు స్పష్టంగా తెలిపాడు. బౌలింగ్‌ను ముఖ్యంగా పరిగణలోకి తీసుకుంటూ జట్టులో స్థిరంగా ఉండడానికే ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఇక గిల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం వెనుక బుమ్రా సూచన కూడా కీలకంగా నిలిచినట్లు స్పష్టమవుతోంది.