ICC Women's T20 World: మహిళల T20 ప్రపంచ కప్ టిక్కెట్ ధరల ప్రకటన.. వారికి టికెట్లు 'ఫ్రీ'
యూఏఈలో జరుగనున్న మహిళల టీ20 ప్రపంచకప్ 2024 కోసం టికెట్ ధరలను ఐసీసీ బుధవారం (సెప్టెంబర్ 11) వెల్లడించింది. టికెట్ల ప్రారంభ ధరను కేవలం ఐదు దిర్హామ్‌లు (సుమారు రూ. 100)గా నిర్ణయించారు. యువతలో క్రీడా ప్రేరణను పెంపొందించేందుకు 18 ఏళ్ల లోపు వారికి టికెట్లు ఉచితంగా అందజేస్తారని ప్రకటించారు. టికెట్ల ధరల ప్రకటనతో పాటు, బుర్జ్ ఖలీఫా మీద టీ20 వరల్డ్‌కప్ లేజర్ షోను ప్రదర్శించారు. మహిళల టీ20 వరల్డ్‌కప్ 2024 అక్టోబర్ 3 నుంచి ప్రారంభమవుతుంది.ఈ మెగా టోర్నీలో 10 జట్లు రెండు గ్రూపులుగా విభజించి పోటీపడతాయి. మొత్తం 18 రోజులపాటు కొనసాగే ఈ టోర్నీలో 23 మ్యాచ్‌లు జరుగుతాయి.
అక్టోబర్ 6న భారత్,పాకిస్తాన్ మ్యాచ్
ప్రతి గ్రూపులో జట్టు మిగతా నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ స్టేజీ ముగిసిన తర్వాత, మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు నాకౌట్ దశకు చేరుకుంటాయి. గ్రూప్-ఏలో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక జట్లు ఉంటాయి. గ్రూప్-బిలో బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, స్కాట్లాండ్ జట్లు పోటీపడతాయి. ఈ టోర్నీలో 20 లీగ్ మ్యాచ్‌లు దుబాయ్, షార్జా వేదికగా జరగనుంది. అక్టోబర్ 17, 18 తేదీల్లో జరిగే సెమీఫైనల్స్ షార్జాలో జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 20న దుబాయ్‌లో జరుగుతుంది. టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు తలపడనున్నాయి. భారత్ అక్టోబర్ 4న తమ తొలి మ్యాచ్(న్యూజిలాండ్‌తో)ఆడనుంది. భారత్,పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అక్టోబర్ 6న దుబాయ్‌లో జరగనుంది.