Captain Vaibhav Sooryavanshi: కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ.. నాయకత్వ బాధ్యతల్లోకి యువ సంచలనం
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) అప్పుడే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ప్రతిష్ఠాత్మక దులీప్ ట్రోఫీలో హేమాహేమీ ఆటగాళ్లు ఉన్న ఈస్ట్ జోన్ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం అతడికి దక్కింది. అయితే ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా ఉండగా.. వైభవ్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు వైభవ్ కెప్టెన్‌గా ఎలా మారాడనే సందేహం రావచ్చు. అసలు విషయం ఏంటంటే.. సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ గాయపడి మైదానం వీడాడు. దీంతో జట్టును నడిపించే బాధ్యతలు సహజంగానే వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీకి వచ్చాయి. దీంతో అతడు ఈస్ట్ జోన్ కెప్టెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
వివరాలు
సీనియర్లను ముందుండి నడిపిస్తూ..
ఈస్ట్ జోన్ జట్టులో సీనియర్ పేసర్ మహ్మద్ షమీతో పాటు ముకేశ్ కుమార్, అభిమన్యు ఈశ్వరన్, కుమార్ కుషాంగ్రా, అనుకుల్ రాయ్ వంటి ఆటగాళ్లు ఉన్నారు.
వీరందరినీ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ముందుండి నడిపిస్తున్నాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఈస్ట్ జోన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఇషాన్ కిషన్ గాయంతో మైదానం వీడాడు.
వివరాలు
అదరగొడుతున్న షమీ..
అయితే సీనియర్ పేసర్ మహ్మద్ షమీ తన పదునైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.
అభిజిత్ సర్కార్ రెండు వికెట్లు పడగొట్టగా.. ముకేశ్ కుమార్ ఒక వికెట్ తీశాడు.
అనుకుల్ రాయ్ కూడా పొదుపుగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి పెంచుతున్నాడు.
తొలి రోజు లంచ్ బ్రేక్ సమయానికి సెంట్రల్ జోన్ 32 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది.
ఆ జట్టు కెప్టెన్ రజత్ పాటీదార్ 12 పరుగులకే పెవిలియన్ చేరి నిరాశపరిచాడు.