వింబుల్డన్‌లో టాప్ సీడ్‌గా నిలిచిన కార్లోస్ అల్కరాజ్
ప్రతిష్టాత్మక వింబుల్డన్ పురుషుల సింగిల్స్‌లో యువ టెన్నిస్ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ సంచలనం సృష్టించాడు. పురుషుల సింగిల్స్‌లో ఈ స్పెయిన్ ఆటగాడికి టాప్‌సీడ్ దక్కింది. ఆదివారం క్వీన్స్‌క్లబ్ టైటిల్ విజేతగా నిలిచిన అతను, జకోవిచ్‌ను వెనక్కి నెట్టి తిరిగి నంబర్‌వన్ ర్యాంకును సాధించిన విషయం తెలిసిందే. ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి రికార్డు స్థాయిలో 23వ గ్రాండ్ స్లామ్ ట్రోఫీతో పాటు ర్యాంకింగ్స్‌లో ఆగ్రస్థానాన్ని సొంతం చేసుకున్న జకో, ఆ తర్వాత ఏ టోర్నిలోనూ పాల్గొనలేదు. దీంతో ఒక ర్యాంకు కోల్పోయి రెండో స్థానంలో నిలిచాడు. వరుసగా గత నాలుగు వింబుల్డన్ (2018, 2019, 2021, 2022) ట్రోఫీలు జకోవిచ్ ఖాతాలో చేరిన విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో 2020లో టోర్నీ నిర్వహించలేదు.
మహిళా విభాగంలో బరిలోకి దిగనున్న ఇగా స్వైటెక్
అదే విధంగా మెద్వెదెవ్, రూడ్, సిట్సిపాస్, హోల్గర్ రూన్, రుబ్లేవ్, సిన్నర్, ఫ్రిట్జ్, తియోఫో వరుసగా 3 నుంచి 10 సీడింగ్‌లు సొంతం చేసుకున్నారు. ఇక మహిళల సింగిల్స్ లో ప్రపంచ నంబర్ వన్ ఇగా స్వైటెక్ టాప్ సీడ్ లో బరిలో దిగనుంది. ఇటీవల ఆమె రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. సబలెంక, డిఫెండింగ్ ఛాంపియన్ రిబకినా, పెగులా, గార్సియా, జాబెర్, గాఫ్, సకారి, క్విటావా వరుసగా 2 నుంచి 10 సీడింగ్ ల్లో నిలిచారు. అదే విధంగా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా నిరుడు రష్యా, బెలరాస్ ప్లేయర్లపై విధించిన నిషేధాన్ని ఈ ఏడాది వింబుల్డన్ తొలగించింది.