
ENG vs IND : మాంచెస్టర్‌లో నాలుగో రోజు వర్షం పడే అవకాశం.. భారత్‌కు ఊరట కలిగించేనా?
ఈ వార్తాకథనం ఏంటి
మాంచెస్టర్ టెస్టులో టీమిండియా తాను ఊహించిన స్థాయికి వెళ్లలేకపోయింది. ఇప్పటికే 186 పరుగుల వెనకంజలో ఉన్న భారత్, ఇప్పుడు గెలుపు కంటే కనీసం డ్రా కోసమే పోరాటం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉండగా, ప్రస్తుతానికి మ్యాచ్‌లో విజయం సాధించే అవకాశాలు ఇంగ్లాండ్‌కే మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఈ టెస్టులో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 358 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఇంగ్లాండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 544 పరుగులు చేసి 186 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ప్రస్తుతం బెన్ స్టోక్స్ (77), లియామ్ డాసన్ (21)లు క్రీజులో ఉన్నారు.
Details
వాతావరణం ఎలా ఉంటుందంటే...
భారత్‌కు డ్రా ఆశలు నిలబెట్టాలంటే నాలుగో రోజు ప్రారంభంలోనే ఇంగ్లండ్‌ను త్వరగా ఆలౌట్ చేయడం అత్యవసరం. అదే సమయంలో వర్షం రూపంలో సహకారం కలిగితే భారత్‌కు మరింత ఊరట కలగవచ్చు. మాంచెస్టర్‌లో నాలుగో రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య వర్షం పడే అవకాశం 20 శాతంగా ఉంది. అలాగే ఆకాశం 77 శాతం వరకు మేఘావృతంగా ఉంటుందని పేర్కొన్నారు. మధ్యాహ్నం సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కేవలం 9 శాతం మాత్రమే పడే అవకాశం ఉందని తెలియజేశారు. అంటే వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడే అవకాశాలు తక్కువే అన్నమాట.
Details
బంతి స్వింగ్ అయ్యే అవకాశం
అయితే వర్షం పడకపోయినా, ఆకాశం మేఘావృతంగా ఉండటం భారత పేసర్లకు అనుకూలంగా మారవచ్చు. ఇంగ్లండ్ వాతావరణంలో ఇలాంటి పరిస్థితుల్లో బంతి స్వింగ్ అయ్యే అవకాశం ఉండటంతో వికెట్లు తీయడం సులభం కావొచ్చు. అదే సమయంలో, భారత బ్యాటర్లకు ఇది సవాలుగా మారే అవకాశమూ ఉంది. సమగ్రంగా చెప్పాలంటే, భారత్ డ్రా సాధించాలంటే వాతావరణం సహకరించాలి, పేసర్లు మెరుపు ప్రదర్శన ఇవ్వాలి. లేదంటే ఈ మ్యాచ్ ఇంగ్లండ్ విజయం వైపు పరుగులు తీసే సూచనలే స్పష్టంగా కనిపిస్తున్నాయి.