Page Loader
Chess: 'ఫిడె' నిబంధనల మార్పు.. జీన్స్‌తో బరిలోకి కార్ల్‌సన్‌
'ఫిడె' నిబంధనల మార్పు.. జీన్స్‌తో బరిలోకి కార్ల్‌సన్‌

Chess: 'ఫిడె' నిబంధనల మార్పు.. జీన్స్‌తో బరిలోకి కార్ల్‌సన్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 31, 2024
09:42 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ నంబర్‌వన్‌ చెస్‌ ఆటగాడు మాగ్నస్‌ కార్ల్‌సన్‌ త్వరలో బ్లిట్జ్‌ ఛాంపియన్‌షిప్‌లో పోటీకి దిగనున్నాడు. ఇటీవల ర్యాపిడ్‌ టోర్నీ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా జీన్స్‌ వేసుకురావడమే కాక, దాన్ని మార్చుకోవాలన్న సూచనలను అతను పాటించకపోవడంతో నిర్వాహకులు అతడిని టోర్నీ నుంచి అర్ధాంతరంగా తొలగించిన విషయం తెలిసిందే. జీన్స్‌ ధరించినందుకు కార్ల్‌సన్‌కు 200 అమెరికన్‌ డాలర్ల జరిమానా కూడా విధించారు. ఈ వివాదం నేపథ్యంలో ఫిడె తమ నిబంధనల్లో మార్పులు చేసింది. ఇప్పుడు జీన్స్‌ వేసుకున్న ఆటగాళ్లను టోర్నీల్లో అనుమతించేలా నిబంధనలను సడలించినట్లు ఫిడె అధ్యక్షుడు ఆర్కాడీ ద్వొర్కోవిచ్‌ తెలిపారు. దుస్తుల విషయంలో కొంత సడలింపు ఇచ్చినా, అధికారిక డ్రెస్‌ కోడ్‌ను పాటించాల్సిందేనని పేర్కొన్నారు. అయితే చిన్న మార్పులు మాత్రమే ఉంటాయని తెలిపారు.

Details

ఆనంద్‌ ఫిడె పదవికి అనర్హుడు: కార్ల్‌సన్‌

ప్రపంచ బ్లిట్జ్‌ ఛాంపియన్‌షిప్‌లో కార్ల్‌సన్‌ పాల్గొంటున్న విషయాన్ని కూడా ఆయన ధ్రువీకరించారు. భారత చెస్‌ దిగ్గజం, ఫిడె ఉపాధ్యక్షుడు విశ్వనాథన్‌ ఆనంద్‌పై కార్ల్‌సన్‌ తీవ్ర విమర్శలు చేశాడు. ఆనంద్‌ ఫిడె పదవిలో ఉండటానికి అనర్హుడని ఆయన వ్యాఖ్యానించాడు. ర్యాపిడ్‌ ఛాంపియన్‌షిప్‌ సందర్భంగా జీన్స్‌ ధరించడంపై కార్ల్‌సన్‌కు అనర్హత విధించినప్పుడు, ఆనంద్‌ వ్యవహరించిన తీరును అతడు తప్పుబట్టాడు. ఆ ఘటనలో ఫిడె తగిన విధంగా వ్యవహరించలేదు. ఆ సమయంలో తాను టోర్నీ నుంచి బయటకు వెళ్లిపోవాలని భావించానని చెప్పారు. కానీ తన నాన్న సూచనతో ఫిడె అధ్యక్షుడు ఆర్కాడీతో మాట్లాడే వరకు వేచి ఉండాలనుకున్నానని పేర్కొన్నారు. అయితే ఆనంద్‌తో జరిగిన సుదీర్ఘ చర్చలు కూడా ఫలితం ఇవ్వలేదన్నారు.