Eng vs SL: 430 పరుగుల టార్గెట్ ఛేజ్.. ఇంగ్లాండ్‌కు శ్రీలంక బిగ్ షాక్!
ఈ వార్తాకథనం ఏంటి
లక్ష్యం 430 పరుగులు.. ఈ స్కోరు చూస్తేనే ఎంతటి ప్రత్యర్థి అయినా ఒత్తిడికి గురవుతుంది. గెలుపుపై ఆశలు వదులుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ శ్రీలంక మాత్రం అద్భుతమే చేసింది. అసాధారణ పోరాటంతో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. సమష్టిగా రాణించిన ఆ జట్టు.. మరో బంతి మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 2 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై సంచలన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 4వికెట్లు మాత్రమే కోల్పోయి 429 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (202; 116బంతుల్లో 21 ఫోర్లు, 10సిక్సర్లు) రికార్డు డబుల్ సెంచరీతో చెలరేగాడు.
వివరాలు
వన్డేల్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు
కేవలం 75 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్న అతడు.. ఆ తర్వాత మరో 39 బంతుల్లోనే ద్విశతకాన్ని అందుకున్నాడు.
ఈ క్రమంలో వన్డేల్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ సాధించిన శుభ్‌మన్ గిల్ రికార్డును బ్రూక్ అధిగమించాడు.
గిల్ 2026లో వెస్టిండీస్‌పై 117 బంతుల్లో 200 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఇతర బ్యాటర్లు కూడా కీలకంగా రాణించారు.
జాక్స్ (66 నాటౌట్), జో రూట్ (69), బాంటమ్ (50) అర్ధ శతకాలతో జట్టు భారీ స్కోరు సాధించడంలో తమ వంతు పాత్ర పోషించారు.
వివరాలు
ఛేదనలో శ్రీలంక బ్యాటర్ల పోరాటం
430 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. బ్యాటర్లు సమష్టిగా రాణిస్తూ ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు.
పవన్ రత్నాయకే (130; 106 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఆవిష్క ఫెర్నాండో (97), కెప్టెన్ శానక (97) తృటిలో సెంచరీలు కోల్పోయినా కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.
జనిత్ లియనాగె (61 నాటౌట్) అర్ధ శతకంతో జట్టు విజయానికి బాటలు వేశాడు. ఛేదన చివరి దశలో శ్రీలంక వరుసగా వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది.
ఒకవైపు వికెట్లు పడుతున్నా జనిత్ లియనాగె మాత్రం పట్టువదలకుండా పోరాడాడు.
వివరాలు
8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది
జట్టును విజయతీరాలకు చేర్చేందుకు చివరి వరకు క్రీజులో నిలిచాడు. చివరి ఆరు బంతుల్లో శ్రీలంక విజయానికి 8 పరుగులు అవసరమయ్యాయి.
తొలి మూడు బంతుల్లోనే రెండు వికెట్లు పడటంతో ఇంగ్లాండ్ గెలిచేలా కనిపించింది. దీంతో శ్రీలంకకు ఓటమి తప్పదేమోనన్న ఉత్కంఠ నెలకొంది.
అయితే, మరో రెండు బంతుల్లో ఆరు పరుగులు చేయాల్సిన సమయంలో లియనాగె అద్భుతమైన సిక్సర్ బాది మ్యాచ్‌ను ముగించాడు.
దీంతో శ్రీలంక 49.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
వివరాలు
వన్డేల్లో రెండో అత్యధిక ఛేదన
వన్డే క్రికెట్ చరిత్రలో 430 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం రెండో అత్యధిక విజయవంతమైన ఛేదనగా నిలిచింది.
ఈ జాబితాలో అగ్రస్థానంలో దక్షిణాఫ్రికా ఉంది. 2006లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో దక్షిణాఫ్రికా 438 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించింది.
ఇప్పుడు ఇంగ్లాండ్‌పై శ్రీలంక సాధించిన అసాధారణ విజయం వన్డే క్రికెట్ చరిత్రలో మరో సంచలనంగా నిలిచింది.