MS Dhoni: చెన్నై ఫ్యాన్స్‌కు షాక్.. మహేంద్ర సింగ్ ధోనీ పూర్తి సీజన్ ఆడడా?
ఈ వార్తాకథనం ఏంటి
ఎంఎస్ ధోని ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) తరఫున ఆడనున్నాడు. ఈ ఏడాది జూలైలో ధోనీ 45 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టనున్న నేపథ్యంలో, ఆయన భవిష్యత్తుపై ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నాయి. సీఎస్‌కే మేనేజ్‌మెంట్ ఆయన ఈ సీజన్‌కు అందుబాటులో ఉంటాడని స్పష్టం చేసినప్పటికీ, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా కొన్ని మ్యాచ్‌లకు విశ్రాంతి ఇవ్వవచ్చని పేర్కొంది. సీఎస్‌కే యాజమాన్యం వెల్లడించిన ప్రకారం, ధోనీ చెన్నైకి వస్తున్న విషయం ఖాయం. ఈ సీజన్‌కు ఆయన అందుబాటులో ఉంటాడు. అయితే అన్ని మ్యాచ్‌లు ఆడతాడా లేదా అన్నది టోర్నమెంట్ జరుగుతున్న సమయంలో పరిస్థితులను బట్టి నిర్ణయిస్తామని తెలిపారు.
Details
సంజూ శాంసన్‌తో వికెట్‌కీపింగ్ ఆప్షన్
ఈ సీజన్‌లో స్క్వాడ్‌లోకి వచ్చిన సంజూ శాంసన్ వల్ల వికెట్‌కీపింగ్ విభాగంలో సీఎస్‌కేకు బలమైన ప్రత్యామ్నాయం లభించింది. ధోనీకి విశ్రాంతి ఇచ్చే మ్యాచ్‌లలో సంజూ గ్లౌజులు ధరించే అవకాశముంది. ఇటీవల కాలంలో ధోనీ మోకాలి, వెన్ను సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. 45 ఏళ్ల వయసులో ప్రతి మ్యాచ్‌లో వికెట్‌కీపింగ్ చేయడం శరీరంపై అదనపు ఒత్తిడిని కలిగించే అవకాశం ఉంది. సంజూ కాకుండా ఉర్విల్ పటేల్, కార్తిక్ శర్మ కూడా వికెట్‌కీపర్లుగా జట్టులో ఉన్నారు. ముఖ్యంగా కార్తిక్ శర్మను సీఎస్‌కే భారీ మొత్తానికి కొనుగోలు చేసి, భవిష్యత్తు ఫినిషర్‌గా తీర్చిదిద్దే ప్రణాళికలో ఉంది.
Details
'ఇంపాక్ట్ ప్లేయర్'గా అవకాశాలు
గత సీజన్‌ల మాదిరిగానే ఈసారి కూడా ధోనీని 'ఇంపాక్ట్ ప్లేయర్'గా వినియోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చివరి ఓవర్లలో ఫినిషర్ పాత్రలో జట్టుకు కీలకంగా మారే అవకాశం ఉంది. ఫిట్‌నెస్ దృష్ట్యా తన బ్యాటింగ్‌ను కొద్ది ఓవర్లకే పరిమితం చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. మైదానంలో ఉన్నంత కాలం జట్టుకు మార్గనిర్దేశం చేసే మెంటార్‌గా ఆయన పాత్ర కీలకంగా ఉండనుంది. చెపాక్‌లో ప్రత్యేక అనుబంధం ఎం.ఏ. చిదంబరం స్టేడియం (చెపాక్)తో ధోనీకి ప్రత్యేక అనుబంధం ఉంది. హోమ్ మ్యాచ్‌లన్నింటిలోనూ ఆయన ఆడేందుకు ప్రయత్నిస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ధోనీ మైదానంలోకి అడుగుపెట్టగానే చెపాక్ అంతా 'ధోనీ.. ధోనీ' నినాదాలతో మార్మోగడం సాధారణ దృశ్యమే.
Details
రిటైర్మెంట్ చర్చలు - గత సీజన్ నేపథ్యం
గత ఐపీఎల్ సీజన్‌లో ధోనీ తల్లిదండ్రులు స్టేడియంలో మ్యాచ్ వీక్షించడంతో రిటైర్మెంట్ ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే మ్యాచ్ అనంతరం సీఎస్‌కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఈ విషయంపై తనకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు.
Details
ఐపీఎల్‌లో ధోనీ రికార్డులు
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు (278) ఆడిన ఆటగాడిగా ధోనీ రికార్డు సృష్టించాడు. సీఎస్‌కేను ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపాడు. 38.30 సగటుతో 5439 పరుగులు నమోదు చేశాడు. వికెట్‌కీపింగ్‌లో 47 స్టంపింగ్స్, 158 క్యాచ్‌లు అతడి ఖాతాలో ఉన్నాయి. అలాగే ఐపీఎల్‌లో 100 మ్యాచ్‌లు గెలిపించిన ఏకైక కెప్టెన్ కూడా ధోనీనే. మొత్తం 226 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2023లో సీఎస్‌కేను చివరిసారి ఛాంపియన్‌గా నిలిపిన ఫైనల్‌లో కూడా ఆయనే నాయకత్వం వహించాడు. ఇలా 45 ఏళ్ల వయసులోనూ జట్టుకు కీలక స్తంభంగా నిలుస్తూ, ధోనీ మరో సీజన్‌కు సిద్ధమవుతున్నాడు.