LOADING...
LSG vs CSK: విజయాల్లో చెన్నై హ్యాట్రిక్.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం.. లక్నో ఔట్!
విజయాల్లో చెన్నై హ్యాట్రిక్.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం.. లక్నో ఔట్!

LSG vs CSK: విజయాల్లో చెన్నై హ్యాట్రిక్.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం.. లక్నో ఔట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 10, 2026
07:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చైన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. 2026 మే 10న చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై గెలిచి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. లక్నో నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 4 బంతులు మిగిలి ఉండగానే ఛేజ్ చేసి గెలుపును అందుకుంది. ఈ విజయంతో చెన్నై ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలిపింది. చేజింగ్‌లో చెన్నై బ్యాటర్లు మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడారు. టీమ్ రన్‌రేట్‌ను పెంచాలన్న లక్ష్యంతో ఆరంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఉర్విల్ పటేల్ ఆడిన ఇన్నింగ్స్ స్టేడియంలో ఉత్సాహం నింపింది.

వివరాలు

13 బంతుల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ

13 బంతుల్లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన ఉర్విల్, ఐపీఎల్ చరిత్రలో చెన్నై బ్యాటర్‌గా సంచలన రికార్డు సృష్టించాడు. 7 సిక్సులు, 2 ఫోర్లతో 50 పరుగులు పూర్తి చేసి, రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ రికార్డును సమం చేశాడు. ఉర్విల్ పటేల్ మొత్తం 23 బంతుల్లో 65 పరుగులు చేశాడు. ఇందులో 8 సిక్సులు, 2 ఫోర్లు ఉన్నాయి. అతను షహబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అతని విధ్వంసకర బ్యాటింగ్ చూస్తున్నంతసేపూ ఐపీఎల్‌లో గేల్ రికార్డు బద్దలవుతుందా అన్న భావన కలిగింది. అంతకు ముందు ఓపెనర్లు సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ శుభారంభం అందించారు.

వివరాలు

రాణించిన గైక్వాడ్

సంజూ శాంసన్ 14 బంతుల్లో 2 సిక్సులు, 3 ఫోర్లతో 28 పరుగులు చేశాడు. అతను దిగ్వేశ్ సింగ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్ 28 బంతుల్లో 2 సిక్సులు, 3 ఫోర్లతో 42 పరుగులు చేసి షహబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. లక్నో బౌలర్లలో షహబాజ్ అహ్మద్ 2 వికెట్లు తీసుకోగా, దిగ్వేశ్ సింగ్ 1 వికెట్ సాధించాడు. ఇక టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 203 పరుగులు చేసింది. ఓపెనర్ జోష్ ఇంగ్లిస్ అద్భుతంగా ఆడుతూ చెన్నై బౌలర్లను కుదిపేశాడు. ఒక దశలో అతను 30 బంతుల్లోనే సెంచరీ చేస్తాడేమో అన్నంత వేగంగా ఆడాడు.

Advertisement

వివరాలు

విఫలమైన లక్నో బ్యాటర్లు

చివరికి 33 బంతుల్లో 85 పరుగులు చేసి ఓవర్టన్ బౌలింగ్‌లో సంజూ శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 6 సిక్సులు, 10 ఫోర్లు ఉన్నాయి. ఇంగ్లిస్ తర్వాత లక్నో బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో పెద్ద స్కోర్ సాధించలేకపోయారు. షహబాజ్ అహ్మద్ చివర్లో వేగంగా ఆడి 25 బంతుల్లో 3 సిక్సులు, 3 ఫోర్లతో 43 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌తోనే లక్నో స్కోర్ 200 దాటింది. మొత్తం మీద ఇంగ్లిస్, షహబాజ్ అహ్మద్ మాత్రమే రాణించడంతో లక్నో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో చెన్నై గెలుపొందింది.

Advertisement