ఆస్ట్రేలియాపై మరో ఫీట్‌ను సాధించిన పుజారా
భారత వెటరన్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై అరుదైన ఘనతను సాధించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఈ మైలురాయిని అందుకున్నాడు. భారత తొలి ఇన్నింగ్స్‌లో 121 బంతుల్లో 42 పరుగులు చేసిన పుజారా ఆస్ట్రేలియాపై 2000 పరుగులు చేసిన నాలుగో భారతీయ ఆటగాడిగా నిలిచాడు. ముఖ్యంగా ఈ టెస్టులో పుజారా శుభ్‌మన్ గిల్‌తో కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. భారత్ స్కోరు 74 ఒక వికెట్ కోల్పోయినప్పుడు పుజారా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. గిల్‌తో కలి రెండో వికెట్‌కు 113 పరుగులు జోడించాడు. అనంతరం ఆఫ్ స్పిన్నర్ టాడ్ మర్ఫీ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
పుజారా సాధించిన రికార్డులివే
పుజారా ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరిగిన 24 టెస్టుల్లో 50.82 సగటుతో 2,033 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, 11 అర్ధసెంచరీలను బాదాడు. సచిన్ టెండూల్కర్ (3,630), వీవీఎస్ లక్ష్మణ్ (2,434), రాహుల్ ద్రవిడ్ (2,143) పరుగులు చేసి పుజారా కంటే ముందు స్థానంలో ఉన్నారు. పుజారా స్వదేశంలో ఆస్ట్రేలియాతో 13 టెస్టులు ఆడి 54.73 సగటుతో 1,040 పరుగులు చేశాడు. పుజారా ఇప్పటివరకు 102 టెస్టులు ఆడి 43.89 సగటుతో 7,154 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు, 35 అర్ధసెంచరీలు చేశాడు. ప్రస్తుతం భారత్ 282 పరుగులకు మూడు వికెట్లను నష్టపోయింది. క్రీజులో విరాట్‌కోహ్లీ (55), రవీంద్ర జడేజా (13) ఉన్నారు. ఇంకా భారత్ 197 పరుగుల వెనుకంజలో నిలిచింది.