WTC Final 2023 : కుప్పకూలిన టీమిండియా టాప్ అర్డర్.. ఇక అతడిపైనే ఆశలన్నీ!
ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. ఇంగ్లండ్ లోని ఓవల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ లో సత్తా చాటిన ఆసీస్ అనంతరం బౌలింగ్‌లో కూడా చెలరేగింది. ఆసీస్ బౌలర్లు విజృంభించడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 38 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో అంజిక్యా రహానే(29), కేఎస్ భరత్(5) పరుగులతో ఉన్నారు. ఇక టాప్ ఆర్డర్ ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ (15), శుభ్‌మన్ గిల్ (13), చతేశ్వర్ పుజారా(14), విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా రవీంద్ర జడేజా (48) రాణించడంతో భారత్ 150 పరుగుల మార్క్ ను దాటింది.
ఐదు వికెట్లు కోల్పోయిన టీమిండియా
ఇక 151 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాను సీనియర్ ఆటగాడు అంజిక్యా రహానే అదుకోవాల్సి ఉంది. ఇంగ్లండ్ పిచ్‌లపై ఆడిన అనుభవం ఉన్న ఈ వెటరన్ ఆటగాడు కీలక ఇన్నింగ్స్ ను ఆడాల్సిన అవసరం ఏర్పడింది. మరో బ్యాటర్ భరత్ తో కలిసి భారత ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంది. 17 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కమిన్స్ బౌలింగ్‌లో రహానే ఎల్బీడబ్ల్యూ అయినా.. అదృష్టవశాత్తూ అది నోబాల్ కావడంతో అతనకి ఓ లైఫ్ లభించింది. దీన్ని రహానే సద్వినియోగం చేసుకుంటాడో లేదో చూడాలి.