LOADING...
FIFA World Cup: ఘనా, ఇంగ్లాండ్, కొలంబియాలకు విజయాలు.. బెక్‌హామ్ రికార్డును సమం చేసిన హ్యారీ కేన్
ఘనా, ఇంగ్లాండ్, కొలంబియాలకు విజయాలు.. బెక్‌హామ్ రికార్డును సమం చేసిన హ్యారీ కేన్

FIFA World Cup: ఘనా, ఇంగ్లాండ్, కొలంబియాలకు విజయాలు.. బెక్‌హామ్ రికార్డును సమం చేసిన హ్యారీ కేన్

వ్రాసిన వారు Moogati Shabari
Jun 18, 2026
01:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫిఫా ఫుట్‌ బాల్ ప్రపంచకప్‌లో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు జరిగిన మూడు మ్యాచ్‌లు అభిమానులను అలరించాయి. ఘనా-పనామా, ఇంగ్లాండ్-క్రొయేషియా, కొలంబియా-ఉజ్బెకిస్థాన్ జట్లు తలపడగా.. మూడు పోరాటాల్లోనూ స్పష్టమైన ఫలితాలు వచ్చాయి. ఈ సందర్భంగా ఇంగ్లాండ్ స్టార్ స్ట్రైకర్ హ్యారీ కేన్ అరుదైన ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

వివరాలు

చివరి క్షణంలో ఘనాకు విజయానందం..

ఘనా జట్టుకు కీలక మిడ్‌ఫీల్డర్ థామస్ పార్టీ అందుబాటులో లేకపోయినా జట్టు పోరాట పటిమను ప్రదర్శించింది. ఇంగ్లాండ్‌లో అతడిపై అత్యాచార కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కెనడాలోకి ప్రవేశానికి అనుమతి లభించకపోవడంతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అయితే మ్యాచ్ మొత్తం ఉత్కంఠగా సాగింది. చివరి వరకు పోరాడిన ఘనా.. అదనపు సమయంలో కలేబ్ 90+5వ నిమిషంలో చేసిన కీలక గోల్‌తో ఆధిక్యం సాధించింది. డ్రాతో సరిపెట్టుకోవాలన్న పనామా ఆశలను ఆ గోల్ చెదరగొట్టగా, చివరకు 1-0 తేడాతో ఘనా విజయాన్ని సొంతం చేసుకుంది.

వివరాలు

ఇంగ్లాండ్‌కు ఘన విజయం.. కేన్‌కు అరుదైన రికార్డు

టోర్నీలో టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన ఇంగ్లాండ్ తన తొలి మ్యాచ్‌లో క్రొయేషియాపై 4-2 తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ 12వ నిమిషంలో హ్యారీ కేన్ పెనాల్టీ ద్వారా గోల్ చేసి ఇంగ్లాండ్‌కు తొలి ఆధిక్యాన్ని అందించాడు. 42వ నిమిషంలో మరోసారి కేన్ గోల్ చేసి ఇంగ్లాండ్‌ను 2-1 ఆధిక్యంలో నిలిపాడు. తొలి అర్ధభాగం అదనపు సమయంలో 45+5వ నిమిషంలో పీటర్ ముసా అద్భుత గోల్‌తో క్రొయేషియా మళ్లీ 2-2తో సమం చేసింది. రెండో అర్ధభాగంలో మాత్రం ఇంగ్లాండ్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. 47వ నిమిషంలో జూడ్ బెల్లింగ్‌హామ్, 85వ నిమిషంలో మార్కస్ రాష్‌ఫోర్డ్ గోల్స్ నమోదు చేయడంతో ఇంగ్లాండ్ 4-2తో విజయం ఖాయం చేసుకుంది.

Advertisement

వివరాలు

ఉజ్బెకిస్థాన్‌పై కొలంబియా సూపర్ విక్టరీ..

ప్రపంచకప్‌లో పోర్చుగల్‌తో ఒకే గ్రూప్‌లో ఉన్న కొలంబియా విజయంతో తన ప్రచారాన్ని విజయవంతంగా ప్రారంభించింది. అదే గ్రూప్‌లో పోర్చుగల్ తొలి మ్యాచ్‌ను డీఆర్ కాంగోతో డ్రా చేసుకోగా, కొలంబియా మాత్రం ఉజ్బెకిస్థాన్‌పై 3-1 తేడాతో ఆకట్టుకునే విజయాన్ని అందుకుంది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన కొలంబియా తరఫున డానియల్ మునోజ్ 40వ నిమిషంలో తొలి గోల్ చేశాడు. అనంతరం 65వ నిమిషంలో లూయిస్ డియాజ్ స్కోరు నమోదు చేయగా, అదనపు సమయంలో 90+9వ నిమిషంలో జామింటన్ క్యాపాజ్ మరో గోల్ చేసి విజయాన్ని మరింత పటిష్టం చేశాడు. ఉజ్బెకిస్థాన్ తరఫున అబ్బోస్‌బెక్ 60వ నిమిషంలో చేసిన ఒక్క గోల్ మాత్రమే ఆ జట్టుకు ఓదార్పుగా నిలిచింది.

Advertisement