LOADING...
Nitish Rana: బెంచ్‌పైనే వివాదం.. అంపైర్‌తో వాగ్వాదం చేసిన నీతీశ్‌కు ఫైన్!
బెంచ్‌పైనే వివాదం.. అంపైర్‌తో వాగ్వాదం చేసిన నీతీశ్‌కు ఫైన్!

Nitish Rana: బెంచ్‌పైనే వివాదం.. అంపైర్‌తో వాగ్వాదం చేసిన నీతీశ్‌కు ఫైన్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 12, 2026
11:49 am

ఈ వార్తాకథనం ఏంటి

చైన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు నీతీశ్ రాణాకు భారీ జరిమానా విధించారు. ఫోర్త్ అంపైర్‌తో అసభ్య పదజాలం ఉపయోగిస్తూ వాగ్వాదానికి దిగినందుకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు, ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా అతడి ఖాతాలో చేర్చింది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో నీతీశ్ రాణా తుది జట్టులో లేకపోవడం, ఇంపాక్ట్ ప్లేయర్‌గా కూడా మైదానంలోకి రాకపోవడం గమనార్హం. బెంచ్‌పై ఉన్న ఆటగాడికి జరిమానా విధించడం అరుదైన సంఘటనగా మారింది. ఇదిలా ఉండగా సీఎస్‌కే నిర్దేశించిన 213 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన దిల్లీ జట్టు 189 పరుగులకే ఆలౌట్ అయింది.

వివరాలు

19వ ఓవర్లో ఘటన

ట్రిస్టన్ స్టబ్స్ 60 పరుగులతో పోరాడినా జట్టును విజయానికి తీసుకెళ్లలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో వివాదానికి దారితీసిన సంఘటన 19వ ఓవర్‌లో చోటుచేసుకుంది. ఆ ఓవర్ రెండో బంతిని జేమీ ఓవర్టన్ వికెట్లకు దూరంగా వేయగా, ఫీల్డ్ అంపైర్ దాన్ని వైడ్‌గా ప్రకటించాడు. వెంటనే ఓవర్టన్ రివ్యూ కోరాడు. ఈసమయంలో స్టబ్స్ తన గ్లౌజులు మార్చుకోవాలంటూ అంపైర్ దృష్టికి తీసుకెళ్లాడు.అయితే ఫోర్త్ అంపైర్ ఆ అభ్యర్థనను తిరస్కరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దిల్లీ ప్రధాన కోచ్ హేమంగ్ బదానీ వచ్చి ఫోర్త్ అంపైర్‌తో చర్చలు జరిపారు. రివ్యూ తర్వాత ఆ బంతి సరైనదిగా తేలింది. అనంతరం వచ్చిన బంతిని షాట్ ఆడే ప్రయత్నంలో స్టబ్స్ మిడాఫ్‌లో నూర్ అహ్మద్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

వివరాలు

భారీ జరిమానా పడే అవకాశం

అప్పటికే అసహనంతో ఉన్న స్టబ్స్ పెవిలియన్‌కు వెళ్లే సమయంలో తన హెల్మెట్‌ను విసిరికొట్టాడు. ఈ ఘటనపై అతడికీ జరిమానా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే సమయంలో బెంచ్‌పై ఉన్న నీతీశ్ రాణా ఫోర్త్ అంపైర్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. కఠిన పదజాలంతో మాట్లాడినందుకు మ్యాచ్ రిఫరీ నివేదిక ఆధారంగా అతడిపై జరిమానా విధించారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌పైనా ఫైన్ విధించారు. స్లో ఓవర్ రేట్ కారణంగా అతడికి రూ.12 లక్షల జరిమానా విధిస్తూ ఐపీఎల్ నిర్ణయం తీసుకుంది. దిల్లీతో మ్యాచ్‌లో సుమారు ఆరు నుంచి ఏడు నిమిషాల ఆలస్యం జరగడంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement