Rinku Singh: ఏఐ వీడియోతో వివాదం.. రింకూ సింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. సోషల్ మీడియాలో ఆయన షేర్ చేసిన ఏఐ-జనరేటెడ్ వీడియో తీవ్ర వివాదానికి దారితీయగా, సోమవారం ఆయనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్ సస్ని గేట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రింకూ సింగ్ షేర్ చేసిన వీడియోనే ఈ వివాదానికి కారణమైంది. ఆ వీడియోలో రింకూ సింగ్ సిక్స్ కొట్టిన తర్వాత, హిందూ దేవుళ్లు కళ్లద్దాలు ధరించి కారులో ప్రయాణిస్తున్నట్లు ఏఐ ద్వారా రూపొందించిన దృశ్యాలున్నాయి. దీనికి నేపథ్యంగా ఒక ఆంగ్లపాటను జోడించారు. వీడియోలో దేవుడే విజయాన్ని అందించాడనే వాక్యాలు ఉన్నప్పటికీ, దేవుళ్లను ఆధునిక వస్త్రధారణతో, పాశ్చాత్య సంగీతం నేపథ్యంలో చూపించడంపై కొన్ని వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.
Details
టీ20 ప్రపంచ కప్ లో సభ్యుడిగా రింకూ సింగ్
ఈ వీడియోపై కర్ణిసేన తీవ్రంగా స్పందించింది. కర్ణిసేన జిల్లా అధ్యక్షుడు సుమిత్ తోమర్ మాట్లాడుతూ మా దేవతలకు కళ్లద్దాలు పెట్టి, ఆంగ్ల పాటలకు డ్యాన్స్ చేయిస్తే సహించమంటూ హెచ్చరించారు. రింకూ సింగ్‌ను 'జిహాదీ'గా అభివర్ణిస్తూ సనాతన ధర్మానికి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వీడియో ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని ఆయన ఆరోపించారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు. వీడియో వాస్తవికతతో పాటు, దాని మూలాలు ఏవన్నదానిపై విచారణ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, రింకూ సింగ్ ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు, అలాగే టీ20 ప్రపంచకప్ 2026 జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు.