
Prithvi Shaw: సప్నా గిల్ కేసులో పృథ్వీ షాకు రూ.100 జరిమానా విధించిన కోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw)యూట్యూబర్ సప్నా గిల్(Sapna Gill)మధ్య కొనసాగుతున్న వివాదం కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. షా తనపై వేసిన పిటిషన్‌కు సమాధానం దాఖలు చేయకపోవడంతో, దిండోషి సెషన్స్ కోర్టు రూ.100 జరిమానా విధించింది. జూన్ 13న షా న్యాయవాదికి చివరి అవకాశం ఇచ్చినప్పటికీ, అప్పటినుంచి ఇప్పటి వరకు స్పందన దాఖలు చేయలేదని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో జరిమానా చెల్లించాలని ఆదేశిస్తూ మరోసారి సమాధానం ఇవ్వడానికి అవకాశం కల్పించింది. తదుపరి విచారణ డిసెంబరు 16కి వాయిదా వేసింది. ఈ కేసులో పృథ్వీ షా, అతడి న్యాయవాదులు కావాలనే వాయిదాలు కోరుతూ కేసును సాగదీస్తున్నారని సప్నా గిల్ తరఫు న్యాయవాది అలీ కాషిఫ్ ఖాన్ కోర్టులో వాదించారు.
Details
డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు
పలుమార్లు సమన్లు జారీ చేసినా, ప్రతిసారి వేరే కారణాలు చెబుతూ ఆలస్యం చేస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇక ఈ వివాదం 2023 ఫిబ్రవరి 15న ముంబయిలోని ఓ ప్రముఖ హోటల్ వద్ద ప్రారంభమైన సంగతి తెలిసిందే. అప్పట్లో పృథ్వీ షా తన అభిమానులకు సెల్ఫీ ఇవ్వడానికి నిరాకరించడంతో పరిస్థితి ఉద్రిక్తమైంది. కొందరు వ్యక్తులు షా, అతడి స్నేహితులపై దాడికి దిగడమే కాకుండా, అతడి స్నేహితుడి కారును కూడా ధ్వంసం చేశారు. అంతేకాక, తప్పుడు కేసు పెడతామని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే నిందితుల వాదన ప్రకారం మాత్రం మద్యం మత్తులో ఉన్న పృథ్వీ షానే వారిపై దాడి చేశాడని ఆరోపించారు.
Details
సప్నా గిల్ సహా ఎనిమిది మందిపై కేసు నమోదు
ఈ సంఘటన పెద్ద వివాదానికి దారితీసింది. అనంతరం సప్నా గిల్ సహా ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మూడు రోజుల కస్టడీ అనంతరం ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు. తర్వాత సప్నా గిల్ అంధేరీ పోలీస్ స్టేషన్‌లో పృథ్వీ షా, అతడి స్నేహితులపై ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడంతో ఆమె అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన కోర్టు, పోలీసులకు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సప్నా కోర్టులో మరోసారి వినతిని దాఖలు చేశారు.