LOADING...
Sourav Ganguly: పాకిస్థాన్‌తో క్రికెట్‌ సంబంధాలు అంతమవ్వాలి.. గంగూలీ
పాకిస్థాన్‌తో క్రికెట్‌ సంబంధాలు అంతమవ్వాలి.. గంగూలీ

Sourav Ganguly: పాకిస్థాన్‌తో క్రికెట్‌ సంబంధాలు అంతమవ్వాలి.. గంగూలీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 26, 2025
10:53 am

ఈ వార్తాకథనం ఏంటి

2008 ముంబయి దాడుల తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్‌ సిరీస్‌లు నిలిచిపోయిన విషయం తెలిసిందే. చివరిసారిగా 2012-13లో భారత్‌లోనే ద్వైపాక్షిక సిరీస్‌ నిర్వహించారు. అప్పటి నుంచీ ఇరు జట్లు కేవలం ఐసీసీ టోర్నీలు లేదా తటస్థ వేదికలకే పరిమితమయ్యాయి. తాజాగా జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో, పాకిస్థాన్‌తో క్రికెట్‌ సంబంధాలను పూర్తిగా తెంచేయాలన్న డిమాండ్లు మళ్లీ ఊపందుకున్నాయి. ఈ అంశంపై భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ తన మద్దతును ప్రకటించాడు. 'వందశాతం అంగీకరిస్తా. ఇకపై పాకిస్థాన్‌తో ఎలాంటి క్రికెట్‌ సంబంధాలు కొనసాగించకూడదు.

Details

బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకోవాలి

బీసీసీఐ ఈ విషయంలో ఖచ్చితంగా కఠిన నిర్ణయం తీసుకోవాలి. ప్రతి సంవత్సరం ఇలాంటి ఉగ్రవాద ఘటనలు జరగడం అంత సులభంగా తీసుకునే విషయం కాదు. ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం సహించకూడదంటూ గంగూలీ తీవ్రంగా వ్యాఖ్యానించాడు. పహల్గాం దాడిపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా, పాకిస్థాన్‌ క్రికెటర్లు మాత్రం మౌనం పాటించడం గమనార్హం. మినహాయింపుగా డానిష్ కనేరియా తప్ప మరెవరూ స్పందించలేదు. గతంలో ఛాంపియన్స్‌ ట్రోఫీ సమయంలో మాత్రం భారత్‌పై పదేపదే విమర్శలు చేసిన వారు ఇప్పుడు ఉగ్రదాడిపై కనీసం ఖండన ప్రకటన చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ విషయంలో ఆ దేశ ప్రభుత్వ విధానాన్నే అనుసరిస్తున్నట్టుగా వారి ప్రవర్తన కనిపిస్తోంది.